తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి… కీలక సూచనలు చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గంలో చర్చించారు. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్ని రోజులు నిర్ణయిస్తారనే దానిపై బీఏసీ సమావేశంలో డిసైడ్ చేస్తారు. ఇక భూభారతి చట్టం అమలు, LRS, మైనింగ్ యాక్ట్ అంశాలపై మంత్రివర్గం చర్చించింది.
భూ భారతి చట్టం అమలు నేపథ్యంలో 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేయనున్నారు. అయితే భూ భారతి చట్టాన్ని ఉగాది నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పది జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 55 ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.