TG Budget Session: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, తొలిరోజు సంతాప తీర్మానాలతో వాయిదా
TG Budget Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
TG Budget Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాప తీర్మానాన్ని సిఎం తొలిరోజు ప్రవేశపెడతారు. సంతాప సందేశాల అనంతరం సభ తొలి రోజు వాయిదా వేస్తారు.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బిఏసీ సమావేశాన్నినిర్వహిస్తారు. కమిటీ సమావేశంలో సభ జరిగే తేదీలను, ఎజెండాను ఖరారు చేస్తారు. బిఏసీలో విపక్ష పార్టీల అభిప్రాయాలను బట్టి సమావేశం తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.
జూలై 25న ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. అందులో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణలో గత ఏడాది డిసెంబరులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించింది.కేంద్ర ప్రభుత్వం మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్‌లో కేటాయింపుల ఆధారంగా తెలంగాణలో శాఖలవారీగా కేటాయింపులు చేయనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల వ్యవధిలో చేసిన పనులను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా మెగాడిఎస్సీ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, గ్రూప్- 1 నోటికేషన్, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలను అసెంబ్లీలో చర్చిస్తారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు అంశాన్ని కూడా చర్చించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు కలిగిన లబ్దిని వివరిస్తారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజక్టులపై ప్రభుత్వ వైఖరిని సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించనుంది. తెలంగాణలో దుమారం రేపిన రాజకీయ అంశాలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది.
కేసీఆర్ రాకపై ఉత్కంఠ…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కేసీఆర్ హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే కాలు జారి పడటంతో ఆయన తుంటికి శస్త్ర చికిత్స జరిగింది. దీంతో మొదటి సెషన్‌కు కేసీఆర్ హాజరు కాలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో కూడా కేసీఆర్ సభకు రాలేదు. తాజాగా బడ్జెట్ సమావేశాలకు వస్తారా రాదా అని చర్చ జరుగుతోంది. 25వ తేదీన శాసనసభకు కేసీఆర్ వస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలను సభలో ఎండగడతారని చెబుతున్నారు.
తెలంగాణలోఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదలలో జాప్యం చేయడం, క్షీణించిన శాంతిభద్రతలు, పెరిగిన చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆరు గ్యారంటీల అమలులో చట్టబద్ధత, రైతు రుణమాపీలో లోపాలు, రైతు భరోసా చెల్లింపు వంటి అంశాలపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని యోచిస్తోంది. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి పార్టీ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు హాజరు కానున్నారు.