R S Praveen Kumar : వర్శిటీలను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారు
Telangana BSP chief R S Praveen Kumar: టెట్,డీఎస్సీ ఒకేసారి నిర్వహించడం సరికాదన్నారు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 13వేల ఖాళీలు అని చెప్పి 5వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
Telangana BSP chief R S Praveen Kumar : రాష్ట్ర గవర్నర్,ముఖ్యమంత్రి మధ్య విభేదాలతోనే యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు ఆగిపోయిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బుధవారం సంగారెడ్డి లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. వర్సిటీల్లో ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలనే కుట్రతోనే విశ్వవిద్యాలయాలను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని… శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నేతలపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో వర్సిటీ వీసీ,రిజిస్ట్రార్,డీన్స్ అందరూ కలిసి 75 శాతం పీహెచ్‌డీ అడ్మిషన్లను తమ అనుచరులకు అమ్ముకున్నారని ఆరోపించారు.
వారిని ఎందుకు పర్మినెంట్ చేయరు..?
రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్… కేవలం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు.ఇన్ని ఏళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇయ్యకుండా కాలయాపన చేసి టెట్,డీఎస్సీ ఒకేసారి నిర్వహించడం సరికాదన్నారు. గడచిన పదేళ్లలో కేసీఆర్ ఏ విద్యాసంస్థను సందర్శించలేదన్నారు.మన ఊరు -మన బడి పథకం నిధుల్లో 8 వేల కోట్ల కాంట్రాక్టులు మేఘా కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారని విమర్శించారు.అంగన్‌వాడీ కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి,కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసినపుడు, అంగన్‌వాడీ కార్మికులను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదని ప్రశ్నించారు.
జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు… మైనారిటీ హాస్టల్ లో కనీస వసతులు కల్పించడంలేదన్నారు. రూ.1,400 కోట్లతో కొత్త సెక్రటేరియట్ కట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, విదేశాల్లో చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ ఫెలోషిప్ కింద ద్వారా రూ.20 లక్షలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెండింగులో ఉన్న ఉపకారవేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు,యువత కోసం పార్టీ ఎన్నికల డిక్లరేషన్‌ను ప్రకటించారు.బీఎస్పీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నాలుగో భాషగా కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడతామన్నారు. విద్యార్థులకు మెట్రోతో సహా, ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. శ్రీకాంతాచారి ఉద్యోగహామీ ద్వారా ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు రీడింగ్,కోచింగ్ కేంద్రాల కోసం జాంబవ స్టూడెంట్ స్పార్క్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
మహాత్మ జ్యోతిరావ్ పూలే విద్యా భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్శిటీల్లో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. యువత కోసం 60 రోజులు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పండగ సాయన్న నవచేతన యువ సహకార సంఘాలు ఏర్పాటుచేసి రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. మాన్యశ్రీ కాన్షిరాం స్ఫూర్తితో యువతను నాయకులుగా తీర్చిదిద్ది వారికి స్థానిక సంస్థల్లో యువతకు 30 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు.యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయుటకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రతి జిల్లాలో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.పూర్ణ-ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.జనాభాలో 99 శాతం ఉన్న పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమని ప్రకటించారు. ఈ సందర్భంగా పట్టణంలో అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి డా.బి.అర్.అంబేడ్కర్ భవన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.
సంబంధిత కథనం