Bandi Sanjay : దమ్ముంటే.. ఎంఐఎం 119 స్థానాల్లో పోటీ చేయాలి.... బండి సంజయ్-telangana bjp president bandi sanjay challenges mim party to contest from all constituencies ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana Bjp President Bandi Sanjay Challenges Mim Party To Contest From All Constituencies

Bandi Sanjay : దమ్ముంటే.. ఎంఐఎం 119 స్థానాల్లో పోటీ చేయాలి.... బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణలో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. అధికారంలోకి వస్తుందని .. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి దమ్ముంటే.. 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరిన ఆయన... కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Bandi Sanjay : ఎంఐఎం పార్టీకి దమ్ముంటే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతోందని, ఆ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటవుతున్నాయన్న ఆయన... అయినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, రామరాజ్యాన్ని స్థాపించడం తథ్యమన్నారు. ప్రజా గోస – బీజేపీ భరోసాలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడ వేద కన్వెన్షన్ లో నిర్వహించిన శక్తి కేంద్రాల స్పీకర్ల వర్క్ షాప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని బండి సంజయ్ ప్రసంగించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో నలుగురు జిల్లా కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రమోషన్లు పొందుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆ ఆధారాలను సేకరిస్తున్నామని, త్వరలోనే వారి బండారాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడలేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన కింద నష్ట పరిహారం అందజేస్తామని, అర్హులందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పారు. 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగుల సందర్భంగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపినిచ్చారు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు దేశంలో చరిత్ర సృష్టించే విధంగా శక్తి కేంద్రాల పరిధిలో 11 వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతోందని బండి సంజయ్ తెలిపారు. బీజేపీకి తెలంగాణలో ఎందుకు అధికారం ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ శిక్షణలో పాల్గొన్న వక్తలంతా స్ట్రీట్ కార్నర్ మీటింగుల ద్వారా ప్రజలకు బీజేపీ విధానాలను వివరించాలని చెప్పారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేస్తే బీజేపీ సునాయసంగా గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అద్బుత సన్నివేశం కోసం ఎంతో మంది కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని... ఈ ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతోందని వివరించారు. బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో మీటింగ్ లు పెట్టే దమ్ము లేదని... కాంగ్రెస్ కు కార్యకర్తలే లేరని విమర్శించిన బండి సంజయ్..... బీజేపికి ఆ సత్తా ఉంది కాబట్టే 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆ తరువాత అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తరువాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించి బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లో ఎండగడతామని అన్నారు.

WhatsApp channel