తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌గు గురిచేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజాసింగ్ ఉదయం నుంచి అసంతృప్తిగానే ఉన్నారు.
నావాడు, నీవాడు అంటూ నియమిస్తే.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తాను నామినేషన్ వేయడానికి వెళ్లినట్టుగా చెప్పారు. దరఖాస్తు కూడా తీసుకున్నాను అని, జాతియ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారని వెల్లడించారు. పార్టీలో ఉంటారా, సస్పెండ్ చేయాలా అని హెచ్చరించారన్నారు. తన దరఖాస్తుపై ముగ్గురు సభ్యులు సంతకం చేశారని, మరో ఏడుగురి సంతకం కావాల్సి ఉందని, అందుకే నామినేషన్ వేయలేదన్నారు.
'కిషన్ రెడ్డి రాజీనామా లేఖ ఇచ్చి ఆమోదించాలని కోరాను. రాజాసింగ్ మా ఎమ్మెల్యే కాదు.. సస్పెండ్ చేయాలని స్పీకర్ చెప్పాలని కిషన్ రెడ్డి చెప్పాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. పార్టీ అధికారంలోకి రావొద్దనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం? అందుకే రాజీనామా చేస్తున్నా. మీకో దండం, మీ పార్టీకో దండం.' అని రాజాసింగ్ అన్నారు.
బీజేపీకి రాజీనామా చేసినా హిందూత్వం కోసం పోరాడుతూనే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. మెుత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి బయటకు వచ్చేలా చేసింది. ఆయన తదుపరి కార్యాచరణ ఏముంటుందో తెలియాల్సి ఉంది.