TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యే కంగా సమావేశం అవుతాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడంపై సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళికా శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అంద చేసింది. నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాలులో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సబ్ కమిటీ సమర్పించనుంది.
మరోవైపు ఎస్పీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను ఉపసంఘానికి సోమవారం అందించింది. ఈ రెండు నివేదికలను తొలుత క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం వీటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి ఆ వివరాలపై చర్చించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉప కులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించినట్టు చెబుతున్నారు. తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉప కులాలు, రెండో క్యాటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో క్యాటగిరీలో ఇతర ఉప కులాలను చేర్చినట్లు తెలుస్తోంది.
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమిం చిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ దామోదర రాజనర్సింహలకు అందచేశారు. ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రి వర్గ ఉపసంఘం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో చర్చించింది. ఈ నివేదికలు నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.