TG SC Categorization Bill : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ చర్చ జరిగింది. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు గతంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే స్పందించామని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించి ప్రక్రియ ప్రారంభించామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరికి అన్యాయం జరగదనని, ఎలాంటి అనుమానం ఉండొద్దని కమిషన్ సూచన చేసిందన్నారు.
ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలు ఉన్నాయని, వీటిని మూడు గ్రూపులుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటి గ్రూప్ లో 15 ఉపకులాలు, వీరిని ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చామన్నారు. రెండో గ్రూప్ లో 18 ఉపకులాలు ఉంటే వీరికి 9 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మూడో గ్రూప్ లో 26 ఉపకులాలు ఉంటే, ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని ప్రకటించారు. వివేక్ వెంకటస్వామి సూచన మేరకు జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతామన్నారు. 2026 జనాభా లెక్కలు ప్రకారం దామాషా విధానం ద్వారా రిజర్వేషన్లు పెంచుతామన్నారు. గ్రూపుల వారీగా రిజర్వేషన్లు పంచుతామని వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో బిల్లుపై జరిగిన చర్చలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ...గతంలో ఒకసారి వర్గీకరణ చేస్తే, కోర్టు నిలిపేసింది. ఈసారి అలా జరగకూడదు. కోర్టుకు పోయినా మళ్లీ వర్గీకరణ నిలదొక్కుకోవాలె అన్నారు. అందుకే పూర్తిగా కమిషన్ చేసిన ఎంపిరికల్ స్టడీ ఆధారంగా, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా శాస్త్రీయంగా వర్గీకరణ చేస్తున్నామన్నారు. అత్యంత వెనుకబడిన కులాలకు అదనపు ప్రయోజనం కల్పించాలని కోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొందన్నారు.
ఆ సూచనల ప్రకారమే అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్-1 లో చేర్చి వారికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించామని, వారికి జనాభా ప్రకారం 0.5 % శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా, 1 శాతం ఇచ్చారన్నారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అందరికీ సమాన అవకాశాలు అందాలనేది తమ ఉద్దేశంమన్నారు. ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న వర్గీకరణ.. సోషల్ జస్టిస్ కోసం జరుగుతున్న వర్గీకరణ అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
సంబంధిత కథనం