TS Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయా? అయోమయంలో అభ్యర్థులు?
TS Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై గందరగోళం నెలకొంది. కేంద్రంలోని బీజేపీ జమిలీ ఎన్నికలంటూ ఇటీవల చేసిన ప్రకటనతో తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు.
TS Assembly Elections : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ నాయకుడిని కదిలించిన, ఒక్కటే ప్రశ్న తెలంగాణ శాసనసభకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లోనే జరుగుతాయా? ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ అక్టోబర్ లో ఇస్తుందా? ఇదే ప్రశ్న అధికార బీఆర్ఎస్ నాయకులైన, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులైన. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వించాలని ఆలోచన చేస్తుండటంతో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయేమో అనే ఆలోచనలో ఉన్నాయి పార్టీలు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాలంటే, ఎన్నికల కమిషన్ అక్టోబర్ మొదటివారంలోనే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ లో కీలక నేత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్, తెలంగాణ ఎన్నికలు సరైన సమయానికి జరగవేమో అని అనుమానం వెలిబుచ్చడంతో, పార్టీ నాయకులూ కూడా అదే అభిప్రాయంలోకి వస్తున్నారు. అయినా బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ ప్రజల మధ్యలో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికలు వాయిదా?
ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెడితే, డిసెంబర్ లో ఎన్నికలు జరగకపోతే, నాయకులకు తీవ్ర ఇబ్బందులు వచ్చి పడేటట్టు కనపడుతుంది. దీంతో ప్రతిపక్ష పార్టీ నాయకులూ ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే, ప్రచారం మొదలు పెట్టాలని ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. తెలంగాణ శాసనసభకు డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా ఎన్నికల వాతావరణం కనపడటం లేదు. అధికార బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ తప్ప అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించినా, ఆ పార్టీ అభ్యర్థులు ప్రతిరోజు అధికార కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. సొంత ఖర్చుతో కానీ, పార్టీ డబ్బుతో కానీ ఇప్పుడే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతుంది. కాంగ్రెస్, బీజేపీ ఇంతకవరకు అభ్యర్థుల్ని ప్రకటించకపోవటంతో, ఆ పార్టీల నేతలు కూడా డబ్బులు ఖర్చయ్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికలు 2024 మేలో జరిగితే తమ భవితవ్యం ఎలా ఉంటుందని మల్లగుల్లాలు పడుతున్నారు.
ఎన్నికలు 2024 మేలో జరిగితే?
బీఆర్ఎస్ లో టికెట్ ఆశిస్తున్న నాయకులూ మాత్రం, ఎన్నికలు ఆలస్యం అయితే కొంతమంది అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉంటుందని, అలా చేస్తే తమకే అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులూ మాత్రం ఎన్నికలు వచ్చే డిసెంబర్లో కాకుండా, 2024 మే, జూన్ లో జరిగితే తప్పకుండా కాంగ్రెస్ లాభపడ్తుందని భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పై, రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆ వ్యతిరేకత తమకే లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు వస్తున్నాయని బేరీజు వేసుకుంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం దేశంలో జమిలి ఎన్నికలు పెట్టాలనే గొప్ప ఆలోచన తమ పార్టీదేనని, జమిలి ఎన్నికలు పెడితే తప్పకుండా బీజేపీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.