ప్రభుత్వ వ్యతిరేకతే బీఆర్ఎస్ పుట్టి ముంచింది.. ఈ 8 అంశాలే కారణం-telangana assembly election results 2023 update analyzing brs defeat unraveling the 8 key factors behind anti incumbency ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రభుత్వ వ్యతిరేకతే బీఆర్ఎస్ పుట్టి ముంచింది.. ఈ 8 అంశాలే కారణం

ప్రభుత్వ వ్యతిరేకతే బీఆర్ఎస్ పుట్టి ముంచింది.. ఈ 8 అంశాలే కారణం

HT Telugu Desk HT Telugu
Dec 03, 2023 02:45 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇటీవల షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
ఇటీవల షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ (Mohammed Aleemuddin)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ 40లోపు స్థానాలకు పరిమితం కావడం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణమైంది. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి ఇటీవల పలు నియోజకవర్గాల్లో ఓటర్లతో మాట్లాడినప్పుడు చెప్పిన కారణాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ స్వయంకృతాపరాధమే ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. 2018లో 88 సీట్లు గెలిచిన గులాబీ పార్టీ ఈసారి అందులో సగం సీట్లు కోల్పోయింది.

1. హామీలు నెరవేర్చకపోవడం

అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం భారీ వ్యతిరేకతకు దారితీసింది. ముఖ్యంగా ఉద్యోగ భర్తీ విషయంలో ఇచ్చిన హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. టీఎస్‌పీఎస్సీ పరీక్షల లీకేజీ నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇంటికో ఉద్యోగం మాట, నిరుద్యోగ భృతి వంటి విషయాల్లో బీఆర్ఎస్ మాట నిలుపుకోకపోవడం ఆగ్రహం కలిగించింది. ముఖ్యమంత్రి కూతురు కవిత ఎంపీగా ఓడిపోతే కొద్దిరోజుల్లోనే ఎమ్మెల్సీని చేశారని, కానీ మా ఉద్యోగం పరిస్థితి ఏంటని నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనం.

ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు గుర్రుగా ఉన్నారు. చాలా గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసే లేకపోవడం, కొన్ని ఊళ్లలో వందల సంఖ్యలో దరఖాస్తులు ఉన్నా ఒకటి రెండు ఇండ్లే నిర్మించడం ప్రజల్లో అసంతృప్తిని మిగిల్చింది.

దళిత బంధు పథకం సక్రమంగా అమలు కాకపోవడం, చాలా గ్రామాల్లో ఇది అమలు కాకపోవడం, అమలైన చోట్ల ప్రజా ప్రతినిధులు రెండు మూడు లక్షల కమిషన్ తీసుకోవడం, ఊళ్లో వందలాది కుటుంబాలు ఉన్నా ఒక్కరికో ఇద్దరికో దళిత బంధు దక్కడం ఆగ్రహం కలిగించింది.

2.కనీస అవసరాలు తీర్చకపోవడం

చాలా చోట్ల ప్రజలకు తమకు రేషన్ కార్డు జారీ చేయలేదని, కుటంబం పెరిగినా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. ఇక చాలా ఏళ్లుగా కొత్త పెన్షన్ మంజూరు చేయలేదని ఆవేదనతో ఉన్నారు. మెదక్ జిల్లా సదాశివనగర్ తండాలో లక్ష్మీ అనే మహిళ తనకు రెండేళ్ల కింద భర్త చనిపోగా ఇప్పటివరకు వితంతు పెన్షన్ రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగరంలో రహదారులు బాగానే ఉన్నా చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం సరిగ్గాలేదు. ఉదాహరణకు బాన్సువాడ, బోధన మధ్య ఉన్న రహదారి ప్రయాణానికి అనుకూలంగా లేదు. బాన్సువాడతో పోలిస్తే బోధన్‌లో ఎలాంటి అభివృద్ధి కనిపించలేదు. దీంతో బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిపై అసంతృప్తి పెరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు రహదారులు దారుణంగా ఉన్నాయి. ఇక పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు ప్రజలను ఏమాత్రం సంతృప్తిపరచలేకపోయాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదల, గ్యాస్ ధర పెరుగుదల గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసింది.

3.అగ్ర నాయకత్వం వ్యవహార శైలి

బీఆర్ఎస్ అధినేత అనేకసార్లు తాను ఇచ్చిన మాటను తానే మార్చేయడం, వ్యతిరేక భాష్యాలు చెప్పుకోవడం వల్ల సోషల్ మీడియాలో అభాసుపాలయ్యారు. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో, దళిత ముఖ్యమంత్రి విషయంలో, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు విషయంలో చాలాసార్లు మాట మార్చడాన్ని సోషల్ మీడియాలో యువత ఎండగట్టింది. ఇక కేసీఆర్ సచివాలయానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేలకు, ప్రజలకు ముఖ్యమంత్రిని కలవడానికి వీలేలేకుండా పోయిందన్న విమర్శ కూడా ప్రజల్లోకి వెళ్లింది. ఇక ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ కూడా అహంకారపూరితంగా వ్యవహరించారని, టీఎస్‌పీఎస్సీ విషయంలో చాలా మాటలు మార్చారన్నఆగ్రహం యువతలో కనిపించింది. చివరకు ఎన్నికల్లో ఓటమికి దారితీసింది.

4. నాయకులపై వ్యతిరేకత

గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలను కనీసం కలిసేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే చుట్టూ ఉండే ద్వితీయ శ్రేణి నాయకత్వం చాలా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ఎమ్మెల్యేను కూడా కలవనివ్వడం లేదని వాపోయారు. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నేతలపై ఉన్న ఓటర్ల అసంతృప్తి రాష్ట్ర నాయకత్వంపై పడింది. కేసీఆర్ మీద కొంత సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థులు, అభ్యర్థుల చుట్టూ ఉన్న కోటరీ మీద ఆగ్రహం చివరికి బీఆర్ఎస్‌‌కు తీవ్ర నష్టం కలిగించింది.

5. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలు కూడా

బీఆర్ఎస్ ప్రభుత్వానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈసారి వ్యతిరేకతను మూటగట్టుకొచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందని, అప్పులు తేవాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. చివరకు కాళేశ్వరం ప్రగతి ఊసెత్తేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు ధైర్యం చేయలేదు.

6. అవినీతిపై ప్రచారం

చాలా మంది బీఆర్ఎస్ నాయకులు సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేశారని ప్రతిపక్షాలు చేసి ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్లు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇసుక మాఫియా అంతా బీఆర్ఎస్ అగ్రనేతల కనుసన్నల్లోనే జరిగిందని, ఆ మాఫియాలో బీఆర్ఎస్ నేతలే భాగస్వాములని ప్రజలు విశ్వసించే వరకూ వెళ్లింది. అలాగే చాలా భూముల కబ్జాలు, ప్రభత్వ పథకాల అమలులో కమిషన్లు బీఆర్ఎస్ సర్కారుపై అవినీతి నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.

7. బీజేపీ బీఆర్ఎస్ బంధం

బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం ఉందని, కేవలం ఉత్తిత్తి విమర్శలతోనే బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేశాయని ప్రజలు గమనించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బండి సంజయ్ కేసీఆర్‌ను జైల్లో పెడతామని చెబుతూ వచ్చారు. లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేస్తారని చెబుతూ వచ్చారు. కానీ అకస్మాత్తుగా బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, లిక్కర్ కుంభ కోణం సద్దుమణగడంతో ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని భావించారు. దీంతో చాలా జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు. కేవలం మైనారిటీలు ఎక్కువగా ఉన్న చోట మాత్రమే వారు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్‌పై మొగ్గుచూపారు.

8. పనిచేయని వ్యతిరేక ప్రచారం..

బీఆర్ఎస్ ప్రభుత్వం తాను చేసిన పనులపై చెప్పుకోవడం కంటే, కాంగ్రెస్‌పై వ్యతిరేక ప్రచారాన్ని బాగా నమ్ముకుంది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, రైతు బంధు రాదని ప్రచారం చేసింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు దీనిని నమ్మలేదు.

పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పనితీరు

బీఆర్ఎస్‌కు నగరాల ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ తన సత్తా చూపింది. హైదరాబాద్‌లో రహదారులు, ఐటీ కారిడార్ అభివృద్ధి ప్రచారం ఇక్కడ బీఆర్ఎస్ ను నిలబెట్టింది. కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందన్న ప్రచారం కూడా ఇక్కడ పనిచేసింది. ఇటీవల కాలంలో భూముల ధరలు బాగా పెరగడం వల్ల ఇప్పుడు తగ్గుతాయేమోనన్న అనుమానాలు కూడా బీఆర్ఎస్‌కు మేలు చేశాయి.

Whats_app_banner