తెలంగాణలో 'ఏసీబీ' దూకుడు...! ఒక్క జులైలోనే 22 కేసులు, నివేదికలోని లెక్కలివే-telangana anti corruption bureau registers 22 cases in july ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో 'ఏసీబీ' దూకుడు...! ఒక్క జులైలోనే 22 కేసులు, నివేదికలోని లెక్కలివే

తెలంగాణలో 'ఏసీబీ' దూకుడు...! ఒక్క జులైలోనే 22 కేసులు, నివేదికలోని లెక్కలివే

తెలంగాణ ఏసీబీ జనవరి నుంచి జూలై వరకు 148 కేసులు నమోదు చేసింది. 93 ట్రాప్ కేసులు, 9 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 15 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 11 రెగ్యులర్ ఎంక్వైరీలు, 17 ఆకస్మిక తనిఖీలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పూర్తి వివరాలను వివరించింది.

తెలంగాణ ఏసీబీ (@TelanganaACB)

గత కొద్ది నెలలుగా తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. అవినీతి అధికారులను పక్కాగా పట్టేసుకునే పనిలో ఉంటోంది. గతేడాది కూడా భారీగానే కేసుల సంఖ్య నమోదైంది. ఈ ఏడాదిలోనూ ఎక్కువ సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది చిక్కుతున్నారు. జనవరి నుంచి జూలై నెల వరకు నమోదైన కేసుల వివరాలను ఏసీబీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

జూలైలో 22 కేసులు నమోదు…

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ… (ఏసీబీ) జూలైలో 13 ట్రాప్ కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా ఒక ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఒక క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు, ఒక సాధారణ విచారణ, ఆరు ఆకస్మిక తనిఖీలతో సహా మొత్తం 22 కేసులను నమోదు చేసింది.

ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేటు వ్యక్తులతో సహా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. వివిధ శాఖల ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో రూ.11.5 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.1.49 లక్షలు పట్టుబడ్డాయి.

జనవరి నుంచి జూలై..! 148 కేసులు

2025 జనవరి నుంచి జూలై మధ్య కాలంలో ఏసీబీ 148 కేసులను నమోదు చేసింది. 93 ట్రాప్ కేసులు, 9 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 15 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 11 రెగ్యులర్ ఎంక్వైరీలు, 17 ఆకస్మిక తనిఖీలు మరియు 3 వివేకవంతమైన విచారణలు ఉన్నాయి. 10 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు / ప్రైవేట్ వ్యక్తులతో సహా 145 మంది ప్రభుత్వ ఉద్యోగుల ట్రాప్ కేసులలో 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

2025 జూలైలో…. 21 కేసులను ఖరారు చేసి తుది నివేదికలను ఏసీబీ ప్రభుత్వానికి పంపింది. జనవరి 2025 నుంచి జూలై 2025 మధ్య కాలంలో నమోదైన కేసులను కూడా ఖరారు చేసి తుది నివేదికలను ప్రభుత్వానికి అందజేసింది.

ఏసీబీ డైరెక్టర్ జనరల్… ఈ నెల 23న అర్ధ వార్షిక క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేసి ప్రధాన కార్యాలయానికి నివేదికలు సమర్పించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అధికారుల పనితీరును కూడా అభినందించారు.

ఇక 2024 ఏడాదిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో లంచాలకు మరిగిన సుమారు 170 మంది అధికారులను అరెస్టు చేసింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎక్కువమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఏసీబీ అరెస్టు చేసిన వారిలో ఈ శాఖ అధికారులే ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ ఏడాది నమోదయ్యే కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది..!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.