TS Weather : మరో 3 రోజులు ఎండలే..! కొన్ని ప్రాంతాలకు రెయిన్ అలర్ట్
Telangana Weather Updates: తెలంగాణలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. మరో మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
AP and Telangana Weather Updates: ఓవైపు నైరుతి రుతపవనాలు ఎంట్రీ ఇచ్చాయి... మృగశిర కార్తె కూడా వచ్చింది. ఏరువాక పనులు కూడా షురూ అయ్యాయి. కానీ భానుడి భగభగలు మాత్రం ఆగటం లేదు. రోజురోజుకూ పరిస్థితి మరింత తీవ్ర అవుతోంది. ఎండ తీవ్రత దాటికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో వడగాలు వీస్తాయని పేర్కొంది. రేపు (శుక్రవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడ గాల్పులు వీస్తాయని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఇక పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మరికొన్నిచోట్ల ఈదురుగాలతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది.జూన్ 19వ తేదీ వరకు వర్ష సూచన ఉందని పేర్కొంది.
ఏపీలో ఇలా…
రాష్ట్రంలో వడగాల్పులు తీవ్రత కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు(శుక్రవారం) 268 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది. ఇక ఎల్లుండి 235 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ఇవాళ (గురువారం )ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5°C, ప్రకాశం -కురిచేడులో 44.2°C, తూర్పుగోదావరి-చిట్యాల, ఎన్టీఆర్ - ఇబ్రహీంపట్నంలో 44.1°C, తిరుపతి జిల్లా సత్యవేడులో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే 210 మండలాల్లో తీవ్రవడగాల్పులు,220 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వివరించింది.