TG AEOs Suspension : తెలంగాణ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం - 162 మంది ఏఈవోలపై సస్సెన్షన్ వేటు!
తెలంగాణ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేరోజు ఏకంగా 162 మంది ఏఈవోలను సస్పెండ్ చేసింది. రైతు బీమా పథకం కోసం వివరాలు నమోదు చేయలేదనే కారణంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్ ఉత్తర్వుల నేపథ్యంలో పలు జిల్లాల నుంచి వచ్చిన ఏఈవోలు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో పని చేస్తున్న 162 మంది వ్యవసాయ విస్తరణాధికారులను(AEO) ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రైతుబీమా వివరాలను నమోదు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వేటు వేసినట్లు పేర్కొంది. అన్ని జిల్లాల్లో కలిపి 160 మందికిపైగా ఏఈవోలు ఇందులో ఉన్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లు కూడా సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఏఈవోల వాదన ఏంటంటే…!
రైతు బీమా విషయంలో తమను సస్పెండ్ చేయలేని ఏఈవోలు చెబుతున్నారు. కేవలం పంటల డిజిటల్ సర్వేలో పాల్గొనడానికి నిరాకరిస్తుండటమే ఇందుకు కారణమని… ఈ కోణంలోనే తమని సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా…తమపై సర్వేల భారం మోపుతున్నారని వాపోతున్నారు. ఇదే విషయంపై కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కారణంలోనే తమని రైతు బీమా పేరుతో తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ చర్యలపై ఏఈవోలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళన కూడా చేపట్టారు. సస్పెండ్ చేసిన ఏఈవో లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిషనరేట్ ముందు అగ్రికల్చర్ డైరెక్టర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇవాళ మరోసారి డైరెక్టర్, కమిషనర్ కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.
ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఏఈవోలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2600 మంది ఏఈవోలు… కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఏఈవోల నెత్తిన రుద్దడం ఎందుకు..? మాజీ మంత్రి సింగిరెడ్డి
మరోవైపు ప్రభుత్వ చర్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…. డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదని ఏఈఓలను వివిధ కారణాలతో సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలపై వేధింపులు తగవన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా ఇది జరుగుతుంటే, ఇక్కడ మాత్రం ఏఈఓల నెత్తిన రుద్దడం ఎందుకు? అని ప్రశ్నించారు.
“తెలంగాణలో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపు, అధిక దిగుబడి సాధించి దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఏఈఓల పాత్ర ఎనలేనిది. అప్పటికీ వారికి పనిభారం పెరుగుతుందని మళ్లీ సర్వే చేయించి, సుమారు 350 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వాటిని మంజూరు చేసి కొత్త వారిని నియమించాలి. ఏఈఓల విజ్ఞప్తి మేరకు డిజిటల్ క్రాప్ సర్వేకు అవసరమైన సహాయకులను నియమించడం, లేదా ఏజెన్సీలకు పనిని అప్పగించడం చేయాలి. డిజిటల్ క్రాప్ సర్వేకు విడుదలైన నిధులను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? ప్రజా పాలన అంటే బెదిరింపులేనా?” అని సింగిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.