TG 2 lakh Loan Waived : రూ.2 లక్షల రుణమాఫీ కాలేదా? అయితే ఇలా చేయండి-వ్యవసాయ శాఖ కీలక ప్రకటన-telangana 2 lakh loan waiver to farmers agriculture department announcement ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg 2 Lakh Loan Waived : రూ.2 లక్షల రుణమాఫీ కాలేదా? అయితే ఇలా చేయండి-వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

TG 2 lakh Loan Waived : రూ.2 లక్షల రుణమాఫీ కాలేదా? అయితే ఇలా చేయండి-వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Aug 17, 2024 09:52 PM IST

TG 2 lakh Loan Waived : రైతు రుణమాఫీపై తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రూ.2 లక్షల లోపు రుణాల వరకు అర్హులైన రైతుల రుణాలను ప్రభుత్వం నెల రోజుల్లోనే మాఫీ చేసిందని తెలిపింది. చివరి విడతలో.. రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది.

రూ.2 లక్షల రుణమాఫీ కాలేదా? అయితే ఇలా చేయండి-వ్యవసాయ శాఖ కీలక ప్రకటన
రూ.2 లక్షల రుణమాఫీ కాలేదా? అయితే ఇలా చేయండి-వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

TG 2 lakh Loan Waived : రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. రూ.2 లక్షల లోపు రుణాల వరకు అర్హులైన రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం నెల రోజుల్లోనే మాఫీ చేసిందని తెలిపింది. దాదాపు 22 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేసినట్లు తెలిపింది. జులై 18వ తేదీన రూ.లక్ష లోపు రుణాలు, జులై 30న రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీన రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది.

మరి రూ.31 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.18 వేల కోట్లతో సరిపెట్టిందని.. రుణమాఫీపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం చివరి విడతలో.. రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది. అంటే ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే... ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.2 లక్షలు బ్యాంకులో జమ చేస్తుంది. వీరిని కలుపుకుంటే రుణమాఫీ మొత్తం మరింత పెరుగుతుంది. అర్హులైన రైతులందరికీ పూర్తిగా రుణ విముక్తి అవుతుందని పేర్కొంది.

ఇప్పటి వరకు రూ.2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వ్యవసాయ శాఖ పేర్కొంది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాసు బుక్ సరిగా, స్పష్టంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ రుణమాఫీ జరిగిందని, ఇందులో ఏ సందేహం లేదని తెలిపింది. బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్ లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి, వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది.

టెక్నికల్ కారణాలు

బ్యాంకులో టెక్నికల్ కారణాలతోనూ దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయని వ్యవసాయశాఖ తెలిపింది. వీటిలో ఉన్న చిన్న చిన్న తప్పులను గుర్తించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరిచేస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసిందని అధికారులు తెలిపారు. అందుకే రూ.2 లక్షల లోపు రుణాలుండీ ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి.. అందుకు కారణం తెలుసుకోవాలన్నారు. ఉదాహరణకు ఆధార్ లేదని గుర్తిస్తే.. వెంటనే ఆధార్ కార్డును ఎంఏవోకు అందించాలని సూచించారు.

రూ.2 లక్షల లోపు రుణమున్నప్పటికీ, మాఫీ కాని రైతులెవరైనా ఉంటే ఆ బ్యాంకు బ్రాంచీ ఉన్న మండలం వ్యవసాయ అధికారిని (MAO) కలిసి ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ తెలిపింది. రుణమాఫీ పోర్టల్ లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణ మాఫీ వర్తించిందా? లేదా? వర్తించకపోవడానికి కారణమేమిటో ఉంటుందని పేర్కొంది. ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్ తో పాటు, ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈవోకు అందించాలని తెలిపింది. వాటిని పోర్టల్లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారని అధికారులు తెలిపారు.

ఎంఈవో వెరిఫికేషన్

కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే.. ఎంఈవో క్షేత్రస్తాయిలో వెరిఫికేషన్ చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకోని పోర్టల్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. ఆధార్ లో, బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిపోలకపోతే, రైతులు సరైన పేరున్న అప్డేటేడ్​ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందన్నారు.

సంబంధిత కథనం