తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బృందాలను నియమిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో పర్యవేక్షణ పెంచాలని భావిస్తోంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రకారం, ప్రతి బృందం మూడు నెలలకు ఒకసారి 100 ప్రాథమిక పాఠశాలలు, 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేస్తుంది. మూడు నెలల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతీ వారం డీఈఓలకు నివేదిక సమర్పించాలి.
జిల్లా విద్యా అధికారులు(డీఈఓ) తమ జిల్లాల్లోని పాఠశాలల సంఖ్య ఆధారంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయులలో రెండు శాతం మంది ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తారు. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసే బృందాలలో ఇద్దరు సభ్యులు, ఒక నోడల్ అధికారి ఉంటారు. ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసే బృందాలలో గెజిట్ ప్రధానోపాధ్యాయుడుతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉంటారు.
ఈ బృందాలు వారానికోసారి సంబంధిత డీఈఓలకు నివేదికను అందిస్తాయి. తనిఖీల నుండి వచ్చిన అన్ని ఫలితాలు, నివేదికలు శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అవసరమైన చోట వనరులను అందించడం ద్వారా బోధన-అభ్యాస ప్రక్రియను బలోపేతం చేయడానికి ఈ యంత్రాంగం ఉపయోగపడుతుంది. ఇన్స్పెక్టర్లు విద్యా సమస్యలు, విద్యా క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, శారీరక విద్య కార్యకలాపాలను తనిఖీ చేయాలి.
తెలంగాణలో 16,474 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటికి 168 కమిటీలు, 3100 ప్రాథమికోన్నత పాఠశాలలకు 35 కమిటీలు, 4672 ఉన్నత పాఠశాలలకు 96 కమిటీలను ఏర్పాటు చేస్తారు. టీచర్లను ఎంపిక చేసే కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని విదాశాఖ డీఈఓలకు ఆదేశాలు ఇచ్చింది.
గతంలోనే ప్రభుత్వం ఈ కమిటీలు నియమించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. అప్పుడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఒకే కమిటీని నియమించాలనుకున్నారు. ఇందుకు స్కూల్ అసిస్టెంట్‌ను నోడల్ అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వచ్చాయి. సీనియర్లను జూనియర్లు ఎలా ప్రశ్నిస్తారని ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో అప్పుడు ఈ నిర్ణయం వెనక్కు వెళ్లిపోయింది. అయితే తాజాగా వేర్వేరు కమిటీలను నియమిస్తుంది ప్రభుత్వం.