TS TET DSC 2024 : 'టెట్' నోటిఫికేషన్ ఉంటుందా...! అభ్యర్థుల డిమాండ్లపై సర్కార్ స్పందించేనా..?
TS DSC TET Exam 2024 : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… టెట్(TS TET) నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ(TS DSC 2024) పరీక్షలను పెట్టాలని ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
TS DSC TET Exam 2024: తెలంగాణ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్(Telangana DSC 2024) వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
టెట్ నిర్వహించండి - ఉపాధ్యాయ అభ్యర్థులు
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో…టెట్ ( TS TET )పరీక్ష నిర్వహణ కోసం ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీని నిర్వహించాలని కోరుతున్నారు. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులే కాకుండా… ప్రస్తుతం డీఈడీ, బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా టెట్ నిర్వహించాలని గట్టిగా కోరుతున్నారు. తమకు అవకాశం ఇస్తే… మెగా డీఎస్సీ కూడా రాసే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావటానికి చాలా సమయం పడుతుందని… ఫలితంగా తమకు ఇప్పుడే టెట్ రాసే ఛాన్స్ ఇస్తే… ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతామని అంటున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వంలోని మంత్రులతో పాటు అధికారులకు కూడా వినతిపత్రాలను ఇస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే…
ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రధానంగా పలు డిమాండ్లను వినిపిస్తున్నారు. గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని… అనేక మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని చెబుతున్నారు. ఈ దృష్ట్యా టెట్‌ను నిర్వహించాలని కోరుతున్నారు. అవకాశముంటే టెట్, డీఎస్సీ(TS DSC TET 2024) రెండింటిని ఒకేసారి నిర్వహించాలని అంటున్నారు. డీఎస్సీ ఇప్పుడు నిర్వహించినా.. ఫలితాలను మాత్రం ప్రకటించకుండా టెట్‌ను నిర్వహించి ఆ తర్వాత తర్వాత తుది ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకుల రిక్రూట్ మెంట్ లో చేపట్టిన విధానాన్నే డీఎస్సీలో కూడా అమలు చేయాలని కోరుతున్నారు.
టెట్ పరీక్షలను నిర్వహించాలనే డిమాండ్ తో ఇటీవలే అభ్యర్థులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు నష్టపోకుండా… టెట్ నిర్వహించిన తర్వాతనే డీఎస్సీ పరీక్షలను పెట్టాలని కోరారు.
టెట్ నోటిఫికేషన్(TS TET Notification 2024) కోసం అభ్యర్థుల నుంచి డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహిస్తుందా..? లేక యథావిధిగా డీఎస్సీ పరీక్షలను చేపడుతుందా…? అనేది చూడాలి…!
సంబంధిత కథనం