KTR Tea Stall : టీ కప్పులో తుపాన్...! సిరిసిల్లలో 'కేటీఆర్ టీ స్టాల్'పై వివాదం
సిరిసిల్లలో కేటీఆర్ టీ స్టాల్ వివాదాస్పదంగా మారింది. అధికారులకు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఆందోళనకు దారి తీసింది. కలెక్టర్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా రాజకీయానికి తెర లేచింది.కేటీఆర్ పేరు ఉంటే టీ స్టాల్ బంద్ చేయించడమేంటని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

సిరిసిల్లకు చెందిన శ్రీనివాస్ సిరిసిల్ల బతుకమ్మ తెప్ప వద్ద ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ పై ఉన్న అభిమానంతో నాలుగేళ్ళ క్రితం శ్రీనివాస్ బతుకమ్మ తెప్ప వద్ద కేటీఆర్ ఫోటో తో ఆయన పేరు మీద టీ స్టాల్ ఏర్పాటు చేశారు. ఉదయం వాకింగ్ కు వచ్చే వారు పెద్ద సంఖ్యలో అక్కడ టీ తాగి కాసేపు సేదతీరుతారు.
అటువైపు వెళ్లిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేటీఆర్ టీ స్టాల్ ట్రేడ్ లైసెన్స్ గురించి ఆరా తీశారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో కలెక్టర్ ఆదేశంతో టీ స్టాల్ ను మున్సిపల్ అధికారులు మూసివేయించారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. టీ స్టాల్ నిర్వాకుడు శ్రీనివాస్ మాత్రం లైసెన్స్ గురించి తనకు తెలియదని చిరు వ్యాపారినని ఆవేదన వ్యక్తం చేశారు. టీ స్టాల్ బంద్ చేయించడంతో ఉపాధి కోల్పోయానని శ్రీనివాస్ ఆవేదనను స్థానికులు కేటీఆర్ దృష్టి తీసుకెళ్ళారు.
స్పందించిన కేటిఆర్...
టీ స్టాల్ పైన కలెక్టర్ చూపిన అనుచిత ప్రతాపంపై కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ట్విట్టర్ వేదికగా అధికారుల తీరును తప్పుబట్టారు. టీ స్టాల్ చిరువ్యాపారి శ్రీనివాస్ పై కలెక్టర్ కు అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. చిరు వ్యాపారంతో ఉపాధి పొందుతున్న శ్రీనివాస్ పై కలెక్టర్ దుర్మార్గంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటున్నా... ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.
బీఆర్ఎస్ నేతల ఆగ్రహం….
కేటీఆర్ పేరు పోటోతో టీ స్టాల్ ఉండడంతో తట్టుకోలేని కలెక్టర్ మూసి వేయించారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్ పేరు ఉంటేనే టీ స్టాల్ బంద్ చేయించిన కలెక్టర్...మీరు కూర్చున్న కలెక్టరేట్, నడుస్తున్న రోడ్డు కేటీఆర్ వేయించిందేనని గుర్తు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ అవసరమా అని ప్రశ్నించారు. కేవలం కేటీఆర్ అంటే నచ్చకనే కలెక్టర్ కేటీఆర్ పేరుతో ఉన్న టీ స్టాల్ ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఫోటో పేరు లేకుండా టీ స్టాల్ ఓపెన్...
కేటీఆర్ టీ స్టాల్ రాజకీయంగా దుమారం లేపడంతో టీ స్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్ చివరకు కేటీఆర్ ఫోటో పేరు తొలగించాడు. బంద్ అయిన టీ స్టాల్ ను ఓపెన్ చేశాడు. కేటీఆర్ పై ఉన్న అభిమానంతో ‘కేటీఆర్ టీ స్టాల్’ అని పెట్టుకున్నానని… టీ స్టాల్ లేకుంటే తనకు బతుకుదెరువు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం పేరు లేకుండా టీ స్టాల్ నడుపుతానని, కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటానని శ్రీనివాస్ తెలిపారు. మొత్తంగా టీ కప్పులో తుఫానులా కేటీఆర్ టీ స్టాల్ వివాదం మారింది.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం