Yuvagalam Nara Lokesh : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల్ని మోసం చేస్తోందన్న లోకేష్….
Yuvagalam ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల్ని మోసం చేస్తోందని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో లోకేష్ యువగళం Yuvagalam Nara Lokesh పాదయాత్ర కొనసాగుతోంది. చిత్తూరు నియోజక వర్గంలో 11వ రోజు లోకేష్ యాత్రను ప్రారంభించారు. కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్దీకరించకపోవడంతో తాము నష్టపోతున్నామని పలువరు ఉద్యోగులు లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.
Yuvagalam Nara Lokesh చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. మంగ సముద్రం క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌ను పలువురు విద్యుత్ ఉద్యోగులు కలిశారు. ఎస్పీడిసిఎల్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని కాంట్రాక్ట్ ఉద్యోగులు మొర పెట్టుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోయారు. ఉద్యోగస్తులను జగన్ దగా చేశారని, ప్రభుత్వ ఉద్యోగస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేస్తానని జగన్ మోసం చేశారని కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి లో వైసిపి ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆలస్యంగా ఇస్తున్నారని, ఇదే ధోరణి కొనసాగితే జీతాలు ఇవ్వకుండా జగన్ హ్యాండ్స్ అప్ అనడం ఖాయమన్నారు.
మరోవైపు పాదయాత్రలో ఉన్న లోకేష్‌ను పలువురు యువ న్యాయవాదుల కలిశారు. నైపుణ్యాభివృద్ధి కోసం చిత్తూరులో లా అకాడమీ ప్రారంభించాలని కోరారు. న్యాయవాదుల మరణానంతరం కుటుంబాలకు ఇచ్చే భృతిని రూ.10లక్షలకు పెంచాలని, ఆర్థిక భరోసాలేని న్యాయవాదుల కుటుంబసభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులకు మార్కెట్ ధరపై ఇళ్లస్థలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, యువన్యాయవాదులను ప్రభుత్వ ప్లీడర్లకు సలహాదారులుగా నియమించి రూ.5వేల రూపాయల గౌరవభృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రూ.40.32 కోట్లతో చేపట్టిన చిత్తూరు కోర్టు భవననిర్మాణాలను నిధులను వెంటనే విడుదలచేసి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థపై కక్షగట్టిందని లోకేష్ ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా న్యాయమూర్తులను అవమానిస్తూ వైసిపి పెద్దలే పోస్టులు పెట్టి సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని, న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్ లో కేటాయించిన రూ.100 కోట్ల నిధులను తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేశారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల డెత్ క్లెయిమ్ ను రూ.10లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చిత్తూరు కోర్టు భవననిర్మాణాలను పూర్తి చేస్తామని, న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
చిత్తూరులోని సంతపేటలో లోకేష్ ను బీడీ కాలనీ, లెనిన్ నగగర్ బీడీ కార్మికులు కలిశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బీడీలు చుడితే కేవలం రూ. 180 నుంచి రూ. 220 వరకు చెల్లిస్తున్నారని ఆరోపించారు. రేయింబవళ్లూ కష్టపడినా కనీస వేతనాలు అమలుకావడం లేదని, సరైన ఆహారం లేని కారణంగా మహిళా కార్మికులు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వాపోయారు.
పొగాకుతో పనిచేయడం వల్ల క్యాన్సర్, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని, కార్మికులు సంపాదించిన దానిలో దాదాపు 45 శాతం డబ్బు ఆస్పత్రుల ఖర్చులకే పోతున్నాయని చెప్పారు. కార్మికచట్టం ప్రకారం వారానికి ఒక రోజు సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలని, మహిళా కార్మికులకు 80 రోజులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, బీడీకార్మికులకు కార్మికచట్టం ప్రకారం కనీస వేతనాలు, ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేదరికంలో ఉన్న కార్మికులకు పక్కాగృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. వెట్టిచాకిరీకి గురవుతున్న బీడీ కార్మికులకు అన్నివిధాల ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేసి వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. బీడీ కార్మికులకు పక్కాగృహ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు పాదయాత్రలో ఉన్న లోకేష్‌కు ఉద్యోగాలు కోల్పోయిన భీమా మిత్రాలు సమస్యలు మొరపెట్టుకున్నారు. డిఆర్ డిఎ క్రాంతి పథకం కింద గత 13సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 1200మంది బీమా సేవలు అందిస్తున్నారని, 2019లో ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం మమ్మల్ని తొలగించిందని ఫిర్యాదు చేశారు.
గతంలో చంద్రన్న బీమా పథకం విజయవంతంగా అమలుకావడానికి సేవలందించామని, పేద కుటుంబంలో ఎవరు చనిపోయినా వెంటనే గుర్తించి ఆర్థికసాయం అందేలా చూశామన్నారు. టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీమా మిత్రలను కొనసాగించాలని కోరారు. డ్వాక్రా మహిళలకు చెందిన రూ.2,200 కోట్ల అభయహస్తం నిధులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన రూ.700 కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం స్వాహాచేసిందని లోకేష్ ఆరోపిచారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా, అభయహస్తం పథకాలను తిరిగి అమలుచేస్తామన్నారు.