warangal Betting: వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు, ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్‌-task force arrested by cricket betting gang in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Betting: వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు, ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్‌

warangal Betting: వరంగల్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు, ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్‌

HT Telugu Desk HT Telugu

warangal Betting: ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్‌ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు ప్రకటించారు.

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్‌

warangal Betting: ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో వరంగల్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ దందా కూడా మొదలైంది. ఆన్ లైన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం, వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులంతా అదే ప్లాట్ ఫామ్ లో బెట్టింగ్ నిర్వహిస్తూ దందా చేయడం స్టార్ట్ అయ్యింది.

ఇలా ఆన్ లైన్ యాప్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా సభ్యులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో మంగళవారం రాత్రి ముగ్గురిని పట్టుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి నుంచి పోలీసులు లక్షా 58 వేల రూపాయల నగదు, నాలుగు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ బోరబండా ఏరియాకు చెందిన చింతపండు కృష్ణ చిట్ ఫండ్స్ బిజినెస్ నడిపించేవాడు. ఆయనతో పాటు హనుమకొండ పద్మాక్షి కాలనీలో టింబర్ డిపో నడిపించే మేడిశెట్టి నరేశ్, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో పాల బిజినెస్ చేసే పులి ఓంకార్, వరంగల్ మండలం పైడిపల్లికి చెందిన పల్లపు సురేశ్, హనుమకొండ కుమ్మరివాడకు చెందిన కేతిరి రంజిత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన పండు.. ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో బెట్టింగులు నిర్వహించడం మొదలు పెట్టారు.

యాప్ ద్వారా బెట్టింగ్

చింతపండు కృష్ణ, మేడిశెట్టి నరేశ్, పులి ఓంకార్, పల్లపు సురేశ్, కేతిరి రంజిత్, పండు ఆన్ లైన్ వేదికగా సాగే ఓ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నారు. దాని ద్వారా బెట్టింగులు మొదలు పెట్టి దందా సాగిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ దందాపై సీరియస్ ఫోకస్ పెట్టిన వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఆరుగురు సభ్యుల ముఠా గురించి సమాచారం అందింది.

దీంతో మంగళవారం రాత్రి హనుమకొండ పద్మాక్షి కాలనీలోని మేడిశెట్టి నరేశ్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు. అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్న చింతపండు కృష్ణ, మేడిశెట్టి నరేశ్, పులి ఓంకార్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంతో అసలు విషయాన్ని వారు ఒప్పుకున్నారు. కాగా మరో ముగ్గురు నిందితులైన పల్లపు సురేశ్, కేతిరి రంజిత్, పండు పరారీలో ఉన్నారు.

బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లను మిగతా విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ సిబ్బంది హనుమకొండ పోలీసులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ సీఐ ఎం.రంజిత్ కుమార్, ఎస్సై వి.దిలీప్, ఇతర పోలీస్ సిబ్బందిని ఏసీపీ ఏ.మధుసూదన్ అభినందించారు. బెట్టింగ్ దందాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, చట్టప్రకారం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఏసీపీ మధుసూదన్ హెచ్చరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం