Sangareddy Crime : గిరిజన మహిళపై అత్యాచారం.. అడ్డుకోబోయిన భర్తపై దాడి.. సంగారెడ్డి జిల్లాలో దారుణం
Sangareddy Crime : ఆ దంపతులు సేవాలాల్ దర్శనానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా రాత్రి అయ్యింది. ఓ విద్యా పీఠంలో తలదాచుకున్నారు. కానీ.. అక్కడే ఆ కామాంధుడు ఉంటాడని ఊహించలేదు. కళ్లముందే భార్యపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళ అత్యాచారానికి గురైంది. అది కూడా భర్త కళ్ల ముందే. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన దంపతులు.. ఈ నెల 2న ఏపీలోని అనంతపురం జిల్లా నేరడిగొండకు పాదయాత్రగా వెళ్లారు. సంత్ సేవాలాల్‌ను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మళ్లీ ఇంటికి తిరిగొస్తూ.. శుక్రవారం రాత్రి సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చేరుకున్నారు.
భర్త ముందే లాక్కెళ్లి..
అప్పటికే రాత్రి అయ్యింది. దీంతో ఓ విద్యాపీఠంలో భోజనం చేశారు. పీఠం ఆవరణలోనే చెట్టు కింద నిద్ర పోయారు. అయితే.. ఆ విద్యా పీఠంలో గుడి నిర్మిస్తున్నారు. తమిళనాడుకు చెందిన మాథవన్ అనే యువకుడు అక్కడ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతను గిరిజన మహిళపై కన్నేశాడు. భర్త కళ్ల ముందే ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
డయల్ 100కు ఫోన్ చేయగా..
భార్యను లాక్కెళ్తుండగా అడ్డుకోబోయిన భర్తపై రాయితో దాడిచేశాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకున్న భర్త.. డయల్ 100కు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు మాథవన్‌ను వెతికి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి తమ స్టైల్‌లో విచారించగా.. అత్యాచారానికి పాల్పడ్డట్టు ఒప్పుకొన్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.
తమ్ముడి హత్య.. అన్నకు రిమాండ్..
తమ్ముడిని హత్య చేసిన అన్నను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. దీని గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి మండలం చీలపల్లికి చెందిన మల్కగోని దుర్గయ్యకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో నుంచి ఎకరా భూమిని తనఖా పెట్టి రూ.7.50 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు చెల్లించకుండా ఆయన మృతి చెందాడు.
మూడు భాగాలుగా పంచాలని..
దుర్గయ్య పెద్ద కుమారుడు యాదయ్య అప్పుగా తెచ్చిన రూ.7.50 లక్షలు చెల్లించి భూమిని విడిపించుకున్నారు. ఆ భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే.. యాదయ్య తమ్ముళ్లు శివయ్య, నాగరాజు.. ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అన్నను ప్రశ్నించారు. ఆ భూమి విలువ రూ.23 లక్షలు ఉంటుందని.. 3 భాగాలుగా పంచాలని పట్టుబట్టారు.
12 గంటల్లోనే..
తనకు రావాల్సిన వాటా కింద రూ.5.70 లక్షలు చెల్లించాలని శివయ్య శుక్రవారం అన్నతో ఘర్షణకు దిగాడు. దీంతో కోపంతో అన్న యాదయ్య బండ రాయితో మోది హత్య చేశాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును 12 గంటల్లోనే ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.