Hyderabad : విషాదం... పార్క్ చేస్తుండగా కారు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
Hyderabad Crime News: హైదరాబాద్ లోని హయత్‌నగర్ విషాదం చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ లో కారు కిందపడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.
Hyderabad: హైదరాబాద్ లో అత్యంత విషాదం ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లోని పార్కింగ్ ఏరియాలో మూడేళ్ల చిన్నారిపైకి కారు ఎక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారును పార్కింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ సీఐ హెచ్ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. బాలిక తల్లిదండ్రులు కర్ణాటక లోని కల్బుర్గికి చెందిన కూలీలని పేర్కొన్నారు. "లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్‌మెంట్ పక్కనే భవనం నిర్మాణంలో పనిచేస్తున్నారు. బయట వేడిగా ఉండటంతో కూతుర్ని అపార్ట్‌మెంట్‌కి తీసుకొచ్చి పార్కింగ్ ఏరియాలోని నీడలో పడుకోబెట్టింది" అని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..?
అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే హరి రామకృష్ణ తన కారును పార్కింగ్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించగా.. బాలికను గమనించలేదు. దీంతో ఆమెపైకి వాహనం దూసుకెళ్లింది. అయితే వెంటనే సదరు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్ మెంట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
చిన్నారి తల్లి కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కూతురిని చూసుకోమని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కుటుంబానికి చెప్పాను. అప్పటికే స్వయంగా నేనే రెండుసార్లు వెళ్లి కుమార్తెను చూసి వచ్చాను. అప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉంది. కానీ క్షణాల్లోనే ఈ విషాదం జరిగింది" అని కవిత కన్నీటిపర్యంతమైంది.
రామకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ కాగా... అతని భార్య ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. “రామకృష్ణపై సెక్షన్ 304-A కింద కేసు నమోదు చేశాం. కేసును దర్యాప్తు చేస్తున్నాము. అమ్మాయి బెడ్‌షీట్‌తో కప్పబడి ఉండటంతో గమనించలేదని అతను చెప్పాడు" అని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.