Madhapur suspicious death: మాధాపూర్ ఓయో గదిలో యువతి అనుమానాస్పద మృతి
Madhapur suspicious death: మాదాపూర్‌లోని హోటల్ గదిలో యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పుదుచ్చేరికి చెందిన యువతి, చెన్నైకు చెందిన యువకుడు కలిసి ఓయో గదికి వచ్చారు. అక్కడ అస్వస్థతకు గురైన యువకుడి ఆస్పత్రికి వెళ్లి వచ్చే సరికి యువతి మృతి చెందింది.
Madhapur suspicious death: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో గదిలో పుదుచ్చేరికి చెందిన యువతి అనుమానాస్పద మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. పుదుచ్చేరికి చెందిన శరవణ ప్రియ (25) హైదరాబాద్‌లోని హెటిరో ఫార్మసిలో ఉద్యోగం చేస్తోంది.
చెన్నైకి చెందిన శ్రీహరి రమేష్(25) తన తండ్రి రమేష్‌కు చెందిన వ్యాపార పనులు చూసుకుంటున్నాడు. పుదుచ్చేరిలోని కామ్‌రాజ్‌నగర్‌కు చెందిన ఎస్.శరవణ ప్రియ(25) కుటుంబంతో సహా కొన్నేళ్ల క్రితం జడ్చర్లకు వచ్చి స్థిరపడ్డారు. ఇద్దరూ చెన్నైలో ఒకే కళాశాలలో ఇంటర్ పూర్తిచేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీహరి రెండు రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఇక్కడే ఉన్న తన స్నేహితురాలు శరవణ ప్రియకు ఫోన్ చేశాడు. తరువాత మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్డు నంబర్ 36లో గోల్డెన్ హైవ్ ఓయో హోటల్‌లో గది బుక్ చేశాడు. మంగళవారం రాత్రి శ్రీహరి ఉంటున్న హోటల్‌కు వచ్చింది. ఇద్దరూ గదిలోనే మద్యం తాగి నిద్ర పోయారు.
శ్రీహరికి అర్ధరాత్రి వాంతులు రావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందాడు. చికిత్స అనంతరం బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో శ్రీహరి రమేష్ తిరిగి రూమ్ కు రాగా అప్పటికే శర్వణ ప్రియ మరణించినట్లు గుర్తించాడు. శ్రీహరి రమేష్ హోటల్ సిబ్బంది మరియు పోలీసులకు సమాచారం అందించారు.
మృతురాలు శరవణ ప్రియ బుధవారం ఉదయం 10.49 సమయంలో హోటల్ రిసెప్షన్‌కు ఫోన్ చేసి తమ గదిని పొడిగించాలని చెప్పినట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు వివరించారు . తర్వాత జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ వచ్చి డోర్ బెల్ కొట్టినా స్పందించకపోవడంతో ఫుడ్ ప్యాకెట్‌ను రిసెప్షన్ వద్ద ఇచ్చి వెళ్లిపోయాడు.ఆమె అనారోగ్యంతోనే ఆమె మృతిచెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మాదాపూర్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.
రెండు వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తుల అదృశ్యం
మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైలార్ దేవ పల్లి డివిజన్ సాయిబాబా నగర్ కు చెందిన దినేష్ కుమార్ అతని స్నేహితుడు గులాం సింగ్ తో కలిసి రెండు రోజుల కిందట మద్యం సేవించాడు.
అప్పటి నుండి దినేష్ కుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినా దినేష్ కుమార్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యాకుత్ పుర భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆఫ్రోజ్(26) భార్య ఆసిఫా ఫాతిమా తో గత గొడవల కారణంగా తల్లితండ్రుల వద్దే ఆఫ్రోజ్ ఉంటున్నాడు. ఈనెల 7న పనికి బయటికి వెళ్ళి అప్పటి నుండి ఆఫ్ రోజు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు భవానీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాద్