ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్లా? లేనట్లా? అయోమయంలో అభ్యర్థులు!-suspense on telangana local body election 2025 waiting for high court verdict on reservations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్లా? లేనట్లా? అయోమయంలో అభ్యర్థులు!

ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్లా? లేనట్లా? అయోమయంలో అభ్యర్థులు!

Anand Sai HT Telugu

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు సరైన సమయాని జరుగుతాయా? అనే అనుమానాలను నిపుణులను వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు

తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కానీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా అని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం 42 శాతం రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉంది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9 నుంచి ఈ ప్రక్రియ మెుదలు అవుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఆ రోజు నుంచి షురూ కానుంది. అయితే రిజర్వేషన్ల కోటా 50 శాత దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేసిన అనంతరం.. అక్టోబర్ 8కి వాయిదా వేసింది న్యాయస్థానం. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ మెుదలుకానుండగా.. అక్టోబర్ 8న కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయేననే ఉత్కంఠ నెలకొంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. మరోవైపు సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వడంతో రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఇప్పటికే విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండగా.. ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇలా కేసు కోర్టులో ఉండగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 42 శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేస్తే.. ఏంటన్న విషయంపై ఆందోళన నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక పోరు ఇప్పుడు ఉండకపోవచ్చు. సర్పంచ్ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దు. తొందరపడి దసరాకు దావత్‌ ఇవ్వకండి. లీగల్‌గా చెల్లుబాటు అవ్వని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి. బీసీలకు 42 శాతం కోటా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతోంది. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే ఏంటి పరిస్థితి? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక కోర్టు రద్దు చేసింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు.' అని ఈటల హెచ్చరించారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్ దాటొద్దు అనే నిబంధనలు అతిక్రమించకూడదు. దీంతో స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలు ఆగకూడదు అనుకుంటే.. చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలు జరపాలి. బీసీ కోటా అమలు అయ్యాకే ఎన్నికలు అనుకుంటే.. లోకల్ పోరు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మెుదలైంది. చాలా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు బతుకమ్మ పండుగకు మహిళలకు బహుమతులు ఇవ్వడం మెుదలుపెట్టారు. దసరాకు దావత్‌లు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఖర్చు భారీగా అవుతోంది. అక్టోబర్ 8న హైకోర్టు తీర్పుపై స్థానిక పోరుపై క్లారిటీ వస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.