Khammam Accident: రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి, భర్త సురక్షితంగా బయటపడటంతో అనుమానాలు-suspects after the death of mother and daughters in a road accident husband escaped safely ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Accident: రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి, భర్త సురక్షితంగా బయటపడటంతో అనుమానాలు

Khammam Accident: రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి, భర్త సురక్షితంగా బయటపడటంతో అనుమానాలు

HT Telugu Desk HT Telugu
May 29, 2024 08:04 AM IST

Khammam Accident: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త సేఫ్‌గా బయటపడగా.. అందులో ప్రయాణిస్తున్న భార్య, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.ఈ ఘటనపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లీ కూతుళ్లు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లీ కూతుళ్లు

Khammam Accident: అది నిత్యం రద్దీగా ఉంటే నేషనల్ హైవే కాదు. ఎంత వేగంగా ఢీ కొట్టినా ముగ్గురూ ఒకేసారి చనిపోయేంత సీన్ కూడా అక్కడ లేదు. అన్నింటి కంటే ముఖ్యంగా కారు నడుపుతున్న భర్త సేఫ్ గా ఉన్నాడు. అందులో ప్రయాణిస్తున్న భార్య, ఇద్దరు పిల్లలు మాత్రం మృత్యువాత పడ్డారు. ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే తల్లీ, కూతుర్ల దేహాలపై ఒక్క చిన్న గాయం కూడా లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న గొడవల నేపద్యంలో భర్త చేసిన పకడ్బందీ హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆడ పిల్లలు పుట్టారనే సాకుతో కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల జోక్యంతో కలిసి ఉంటున్న క్రమంలో మంగళవారం రాత్రి భార్యా పిల్లలతో కలిసి కారులో ఊరికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో కారు రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా, అతడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో చోటు చేసుకొంది. అల్లుడే తన కుమార్తెను, మనవరాళ్లను చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలంలో విగతజీవులుగా పడి ఉన్న తల్లి, ఇద్దరు పిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు.

అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు సీపీఆర్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఏన్కూరు మండలం రామ్ నగర్ తండాకు చెందిన ధరంసోత్ హరిసింగ్ చిన్న కుమార్తె కుమారిని రఘునాథపాలెం మండలం బావోజీతండాకు చెందిన బోడా ప్రవీణ్ కు ఇచ్చి 2017లో వివాహం చేశారు.

రూ.25 లక్షలు కట్నం ఇచ్చారు. ఫిజియోథెరపీ చదివిన ప్రవీణ్ వృత్తి రీత్యా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. కుమారి, ప్రవీణ్ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు కృషిక(5), కృతిక(3) ఉన్నారు. 20 రోజుల క్రితం ప్రవీణ్ తన స్వగ్రామం బావోజితండాకు భార్యా పిల్లలతో వచ్చాడు. ఈనెల 3న వివాహ దినోత్సవం ఉండగా, ప్రవీణ్ అందుబాటులో ఉండకపోవడంతో కుమారి తన ఇద్దరు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ప్రవీణ్ తన భార్యా పిల్లలతో కలిసి మంచుకొండ నుంచి భావోజీతండాకు కారులో ప్రయాణిస్తుండగా కారు రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కృషిక, కృతిక అక్కడికక్కడే మృతి చెందగా, కుమారిని జిల్లా ప్రభుత్వ హాస్పటల్ కి తరలిస్తుండగా కన్నుమూ సింది. ప్రవీణ్ మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడిని హైదరాబాద్ కు తరలించారు.

ఆడ పిల్లలు పుట్టారనే..

రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న కుమారి తల్లి దండ్రులు, బందువులు జిల్లా ప్రభుత్వ హాస్పటల్ కు చేరుకున్నారు. ప్రవీణ్ కావాలనే రోడ్డు ప్రమాదం చేశాడని ఆందోళన చేశారు. కుమారి తండ్రి హరిసింగ్ విలేకర్లతో మాట్లాడుతూ తన కూతురు, అల్లుడుకు మధ్య 11 నెలలుగా వివాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ హాస్పటల్లో పని చేస్తున్న కేరళ అమ్మాయితో తన అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో కలిసి కేరళ వెళ్లాడని తెలిపారు.

ఆ తర్వాత అతడి ఆచూకీ కనుగొని తీసుకువచ్చి హన్మకొండ ప్రాంతంలో పసరు మందు తాగించామని, అయినా ప్రవీణ్ గొడవలు మానలేదని తెలిపారు. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న నువ్వు నాకు వద్దని, చంపుతా అంటూ కుమారిని తరుచూ వేధించేవాదని వాపోయారు. కావాలనే కారును చెట్టుకు ఢీ కొట్టించి తల్లి, ఇద్దరు ఆడ పిల్లల మరణానికి కారణమయ్యాడని అతను రోదించారు. ఎన్నో దేవుళ్లకు పూజలు చేసిన తర్వాత తమకు కుమారి పుట్టిందని, రూ.25 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ్ముడా నన్ను తీసుకువెళ్లు..

ఆదివారం రాత్రి 11గంటల సమయంలో కుమారి తన తమ్ముడితో వాట్సాప్‌లో ఛాటింగ్ చేసింది. "తమ్ముడా ఉదయం ఇంటికి వస్తాను. నేను ఇక్కడ ఉండలేక పోతున్నా.. నేను ఉండను ఇక్కడ.. నా వల్ల కాదు.." అంటూ కన్నీరు పెడుతున్న ఇమేజేస్ పెట్టి ఛాటింగ్ చేసింది. దానికి రిప్లయ్ ఇచ్చిన కుమారి తమ్ముడు ఉదయం వస్తానని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో కుమారి పుట్టింటికి వెళ్లకుండానే ఇద్దరు పిల్లలతో కలిసి మృత్యు కౌగిలిలోకి చేరుకొందని బంధువులు కన్నీరు పెట్టారు. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)

టీ20 వరల్డ్ కప్ 2024