TG Schools : మమ్మల్ని వదిలిపోవద్దు సార్- బదిలీ అయిన టీచర్ ను వెళ్లొద్దని విద్యార్థులు కన్నీళ్లు-suryapet govt school students emotional teacher transferred to another school video viral ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Schools : మమ్మల్ని వదిలిపోవద్దు సార్- బదిలీ అయిన టీచర్ ను వెళ్లొద్దని విద్యార్థులు కన్నీళ్లు

TG Schools : మమ్మల్ని వదిలిపోవద్దు సార్- బదిలీ అయిన టీచర్ ను వెళ్లొద్దని విద్యార్థులు కన్నీళ్లు

Bandaru Satyaprasad HT Telugu
Jun 28, 2024 02:05 PM IST

TG Schools : విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుంది. విద్యార్థులను సన్మార్గంలో నడిపే మార్గదర్శి గురువు. తెలంగాణలో టీచర్ల బదిలీలు జరిగాయి. బదిలీపై వెళ్తున్న టీచర్లను వెళ్లవద్దని విద్యార్థులు బోరున విలపించిన ఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

మమ్మల్ని వదిలిపోవద్దు సార్- బదిలీ అయిన టీచర్ ను వెళ్లొద్దని విద్యార్థులు కన్నీళ్లు
మమ్మల్ని వదిలిపోవద్దు సార్- బదిలీ అయిన టీచర్ ను వెళ్లొద్దని విద్యార్థులు కన్నీళ్లు

TG Schools : బడి పిల్లలకు టీచర్లతో ఎంతో అనుబంధం ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత టీచర్లే పిల్లలను శ్రద్ధగా చూసుకుంటారు. ఇక ప్రభుత్వ బడుల్లో అయితే విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య బంధం మరింతగా ఉంటుంది. తన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తారు. విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించేది గురువులే. తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. అయితే పలు పాఠశాలల్లో బదిలీపై టీచర్లు వెళ్తున్నారని తెలుసుకుని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను, తమ పాఠశాలను వదిలి వెళ్లొద్దని వేడుకుంటున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులను పట్టుకుని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల పాఠశాల గేట్లు మూసివేసి మా స్కూల్ వదిలిపోవొద్దు సార్ అంటూ చిన్నారులు అడుగుతుంటే చూసినవాళ్లకు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.

బోరున విలపించిన విద్యార్థులు

విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య బంధానికి సూర్యాపేటలో జరిగిన ఘటన ప్రతీకగా నిలుస్తుంది. సూర్యాపేట జిల్లా పోలుమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 14 ఏళ్లుగా పనిచేసిన తెలుగు ఉపాధ్యాయుడు సైదులు బదిలీపై మరో పాఠశాలకు వెళ్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయనను వెళ్లొద్దని వేడుకున్నారు. తెలుగు టీచర్ సైదులుకు వీడ్కోలు సందర్భంగా విద్యార్థులు బోరున విలపించారు. ఈ ఘటనతో పాఠశాల ఆవరణం ఉద్వేగభరితంగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య అపురూప బంధానికి ఈ ఘటన నిదర్శనం అని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సుధీర్ సార్ మమ్మల్ని వదిలి వెళ్లొద్దు

మరో పాఠశాలలో తమ టీచర్ బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమ స్కూల్‌ విడిచిపెట్టి వెళ్లవద్దని పాఠశాల గేటు దగ్గర అడ్డుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. సుధీర్ అనే టీచర్ మరో పాఠశాలకు బదిలీఅయ్యారు. దీంతో ఆయన పాఠశాలకు వచ్చి వెళ్తున్న సమయంలో చిన్నారులంతా గేటు దగ్గర అడ్డుకున్నారు. సుధీర్ సార్ మమ్మల్ని వదిలి వెళ్లొదంటూ గేటుకు అడ్డంగా నిలబడ్డారు. ఆ చిన్నారుల మాటలతో చూపరులు ఉద్వేగానికి లోనైయ్యారు. ఆ చిన్నారుల ప్రేమకు, తనపై పెంచుకున్న అభిమానానికి ఉప్పొంగిపోన టీచర్, మళ్లీ తాను వస్తానని కన్నీళ్లు పెట్టుకోవద్దన్నారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని సుధీర్ భావోద్వేగానికి లోనయ్యారు. సుధీర్ శామీర్ పేట నుంచి బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఉపాధ్యాయుల బదిలీలు

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం, మళ్లీ లోక్ సభ ఎన్నికలు రావటంతో ఈ ప్రక్రియ ముందుగా సాగలేదు. ఇటీవలే ఈ ప్రక్రియపై దృష్టిపెట్టిన విద్యాశాఖ… షెడ్యూల్ ను విడుదల చేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. పదవీ విరమణకి మూడేళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇటీవల ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

మ‌ల్టీ జోన్ 1లో ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు బదిలీ ప్రక్రియ కొనసాగింది. ఇక మ‌ల్టీ జోన్ 2లో అయితే జూన్ 8వ తేదీ నుంచి జూన్ 30 వ‌ర‌కు బ‌దిలీలు, ప‌దోన్నతులు చేప‌ట్టనున్నారు. గ‌తంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించారు.

Whats_app_banner