నకిలీ డాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీ, సీఐలు..-suryapet dsp and ci caught by acb for demanding bribe from fake doctors ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నకిలీ డాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీ, సీఐలు..

నకిలీ డాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీ, సీఐలు..

Sarath Chandra.B HT Telugu

నకిలీ డాక్టర్ల నుంచి లంచం డిమాండ్‌ చేసి సూర్యాపేట డిఎస్పీ, సీఐలు ఏసీబీకి చిక్కారు అనుమతి లకుండా స్కానింగ్ సెంటర్లను నిర్వహిస్తున్న ఫేక్‌ డాక్టర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు పంపకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేయడంతో నిందితులు ఏసీబీకి పిర్యాదు చేశారు.

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీ, సీఐ

ఫేక్ డాక్టర్లను అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి పంపాల్సిన పోలీసులు వారితో బేరం కుదుర్చుకున్నారు. లంచం డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో నిందితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు సూర్యాపేట డిఎస్పీ, సీఐలను పట్టుకున్నారు.

సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ రాఘవులు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరో ధక శాఖ అధికారులకు చిక్కారు. సూర్యాపేటలోని రెండు ప్రైవేటు హాస్పటల్స్‌తో పాటు ఒక స్కానింగ్ సెంటర్‌ను నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఏర్పాటు చేసినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఏప్రిల్‌ 23న ఫిర్యాదు చేశారు.

ఐఎంఏ ఫిర్యాదుతో సూర్యాపేట టూటౌన్‌లో ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేశారు. స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను రిమాండుకు తరలించకుండా ఉండాలంటే సూర్యాపేట డీఎస్పీ పార్థసారథితో మాట్లాడుకోవాలని ముగ్గురు నిందితుల్లో ఒకరికి సూర్యాపేట సీఐ వీర రాఘవులు సూచించారు.

దీంతో డిఎస్పీని సంప్రదించడంతో రిమాండ్‌ లేకుండా చేయాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని నకిలీ వైద్యుడిని డీఎస్పీ డిమాండ్ చేశారు. చివరికి రూ.16 లక్షలు ఇచ్చేలా డిఎస్పీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ క్రమంలో డబ్బులు త్వరగా ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి పెంచడంతో నల్గొండలోని ఏసీబీ అధికారులను నకిలీ వైద్యుడు ఫిర్యాదు చేశాడు.బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అదనపు ఎస్పీ కమలాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం డిఎస్పీ, సీఐలను అదుపులోకి తీసుకొని విచారించారు.

లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. డిఎస్పీ, సీఐ ఇల్లు , కార్యాలయాలలో సోదాలు చేపట్టారు. నిందితులను హైదరాబాద్ లోని నాంపల్లి అనిశా కోర్టులో మంగళవారం హాజరుపర్చనున్నారు. ఏసీబీకి చిక్కిన సీఐ హాలియా, నిడమానూరు,త్రిపురారంలలో రైస్ మిల్లర్ల అక్రమాలకు సహకరించాడనే ఆరోపణలు ఉన్నాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం