అది 2021 ఏప్రిల్ నెల.. కోదాడ పోలీస్ డివిజన్ మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలపాటి తండా. ఆ తండాలో ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. ముక్కుపచ్చలారని కన్న కూతురును క్షుద్రపూజలకు బలి ఇచ్చింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలు సేకరించారు. వాటిని కోర్డుకు సమర్పించగా.. తాజాగా సూర్యాపేట జిల్లా కోర్టు నిందితురాలికి ఉరిశిక్ష విధించింది.
మేకలపాటి తండాలో నిందితురాలు బానోతు భారతి అలియాస్ లాస్య (32) నివసించేది. తనకున్న సర్పదోషాన్ని తొలగించుకునేందుకు.. క్షుద్ర పూజలు చేయించుకుంది. అందుకు తన కన్నకూతురును నరబలిగా ఇచ్చింది. 7 నెలల వయస్సున్న తన కూతురును లాస్య దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు వచ్చింది.
ఫిర్యాదు వచ్చిన వెంటనే అప్పటి మోతె ఎస్సై ప్రవీణ్ కుమార్ (ఇప్పుడు మునగాల ఎస్సై) స్పందించారు. పకడ్బందీగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అప్పటి మునగాల సీఐ ఆంజనేయలుకు కేసును అప్పగించారు. ఆయన దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాల్ని సమర్పించారు.
ఆధారాలను పరిగనణలోకి తీసుకున్న సూర్యాపేట జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు.. సంచలన తీర్పు ఇచ్చింది. జడ్జి శ్యామాశ్రీ.. కన్న కూతురిని హతమార్చిన నిందితురాలైన భారతికి ఉరి శిక్ష విదిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ మొదలయినప్పటి నుంచి.. జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఎప్పటికప్పుడు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, మోతె ఎస్సై యాదవేంద్రలకు సూచనలు చేశారు.
ఈ కేసు విచారణలో ఉండగానే నిందితురాలు భారతి తన భర్తపై హత్యాయత్నం చేసింది. ఆ కేసులో కూడా హుజుర్‌నగర్ సబ్ కోర్టు భారతికి ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ ఆధునిక యుగంలో ప్రజలు మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. పోలీస్ కళాజాతా బృందాలతో మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో " ప్రజా భరోసా " కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సంబంధిత కథనం