Suryapet Congress : కదనరంగంలోకి కాంగ్రెస్ ప్రచార రథాలు, రసవత్తరంగా సూర్యాపేట రాజకీయం!
Suryapet Congress : హస్తిన నుంచి ఇంకా సీట్ల కేటాయింపు జరగకుండానే కొందరు కాంగ్రెస్ నేతలు ప్రచారానికి తెరలేపారు. ప్రచార రథాలు సిద్ధం చేసుకుని రంగంలో దిగేందుకు రెడీ అయ్యారు.
Suryapet Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లో అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ల వ్యవహారం హస్తినకు చేరింది. తమకంటే తమకే టికెట్ కావాలని నియోజకవర్గానికి సరాసరిన కనీసం అయిదుగురు ఆశావహులు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఆ పంచాయితీ తెగలేదు. దరఖాస్తుదారుల జాబితాతో కాంగ్రెస్ నాయకత్వం హస్తినకు చేరింది. అత్యధిక స్థానాల్లో పోటీ దారులు ఎక్కువే ఉన్నారు. ఇక, తుది జాబితాలో తమ పేరు ఉంటుందో, ఉండదో కూడా తెలియక పోయినా.. టికెట్ తమదే అన్న విశ్వాసంతో కొందరు నేతలు అప్పుడే ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రచార రథాలు సిద్ధం
గతంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన వారు, ఈ ఎన్నికల్లో పోటీకి తొలిసారి టికెట్ ఆశిస్తూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న వారు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ప్రచార రథాలు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఏకంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసి ప్రచార రథాలు తయారు చేయిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు అందరు ఆశావహులు ఈ పనిలో ఉన్నారు. తాజాగా సూర్యాపేటకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తన ప్రచార రథానికి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ‘ఇక, ప్రచార రంగంలోకి దూకడమే మిగిలింది’ అని పటేల్ రమేష్ రెడ్డి అనుచరుడొకరు వ్యాఖ్యానించారు. పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి రేవంత్ రెడ్డితో కలిసి వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జిల్లా నాయకుల్లో పటేల్ రమేష్ రెడ్డి ముఖ్యుడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ సారథ్య బాధ్యతల్లో ఉన్నందున తనకు టికెట్ ఖాయమన్న భరోసాలో ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో తక్కువ ఓట్ల వ్యత్యాసంతో దామోదర్ రెడ్డి ఓడి పోయి రెండో స్థానంలో నిలిచారు.
టికెట్ కోసం పోటాపోటీ
సూర్యాపేట టికెట్ కోసం మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య పోటీ బాగా నెలకొంది. సుదీర్ఘ కాలం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన దామోదర్ రెడ్డి, రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో తుంగతుర్తి ఎస్సీలకు రిజర్వు కావడంతో పొరుగునే ఉన్న సూర్యాపేటకు వలస వచ్చి 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. కానీ, 2014, 2018 శాసన సభ ఎన్నికల్లో ఆయన వరుసగా ఓటమి పాలయ్యారు. ఈ కారణంతో 2023 ఎన్నికల్లో టికెట్ తనకే కేటాయించాలని పటేల్ రమేష్ రెడ్డి పట్టుబడుతున్నారు. హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ లభించిందో కానీ, ప్రచారంలో వెనకబడకూడదన్న ఉద్దేశంతో ఆయన ప్రచార రథాలు సిద్ధం చేసుకుని జనంలోకి వెళ్లడానికి తయారవుతున్నారు. ఇదే తరహాలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, మునుగోడు, మిర్యాలగూడెం తదితర నియోజకవర్గాలలో సైతం ప్రచార రథాలు మెరుగులు దిద్దుకుంటున్నాయి.
రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ
టాపిక్