MLC Kavitha Bail : 'రాజకీయ పార్టీలను సంప్రదించి మేము ఆదేశాలిస్తామా'..? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా..? అని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా..? అని సీరియస్ అయింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టింది. ‘సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా..?’ అని వ్యాఖ్యానించింది.
రాజ్యాంగ విధులను నిర్వర్తించే ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడింది. 'రాజకీయ పార్టీలను సంప్రదించి తాము ఆదేశాలిస్తామా ..?" అంటూ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలాంటి విమర్శలను పట్టించుకోమని.. మా విధిని మాత్రమే నిర్వహిస్తామని చెప్పింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని వేసిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై చేసిన వ్యాఖ్యలు ధర్మాసనం దృష్టికి రావటంతో తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదని హితవు పలికింది.
ఇలాంటి విమర్శలని తాము ఎలాగో సీరియస్‌గా తీసుకోమన్న న్యాయస్థానం.. ఆదేశాలు ఇచ్చేముందు రాజకీయ పార్టీని సంప్రదిస్తామా..? అని ప్రశ్నించింది. ఇక ఓటుకు నోటు కేసు బదిలీ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది.
అసలు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలేంటి..?
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవలే కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన… 16 నెలలు జైల్లో ఉన్న సిసోడియా, ఇంకా జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు రాని బెయిల్ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందన్నారు. కవిత బెయిల్ కోసం బీఆర్‌ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందని కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్‌కు ఒక న్యాయం, మిగితా వారికి మరో న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. అత్యున్నత న్యాస్థానం నుంచి బెయిల్ పొందితే సీఎం ఇలా మాట్లాడటమేంటని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.