తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు!-supreme court refused to stay on telangana group 1 appointments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు!

తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు!

Anand Sai HT Telugu

గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

గ్రూప్ 1 ఫలితాలపై సుప్రీం కోర్టు

తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. గ్రూప్‌ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని పేర్కొంది.

తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడంపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద డివిజెన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం మీద అభ్యర్థుల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసునకు సంబంధించి ప్రధాన పిటిషన్స్.. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఈ నెల 15వ తేదీన విచారణకు రానున్నాయని, జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్టుగా తెలిపింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పాటించాలని స్పష్టం చేసింది. వీలైనంతం తొందరగా పిటిషన్లను విచారించి ఆదేశాలివ్వాలని పేర్కొంది. ఈ అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణను ముగించింది.

గ్రూప్ 1 కు ఎంపికైన మొత్తం 562 మందికి సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. గ్రూప్-1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. మెయిన్స్ 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30వ తేదీన మెయిన్స్ పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన అభ్యర్థుల మార్కులను ప్రకటించారు. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనను చేపట్టారు. పరిశీలన టైమ్‌లో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్స్ తీసుకుని, దాని ఆధారంగా తుది ఎంపిక పూర్తి చేసింది.

ఆ తర్వాత పలు కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ ముగిసిన అనంతరం జవాబు పత్రాలు రీవాల్యూయేషన్ చేయాలని, లేదంటే మరోసారి పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. దీనిపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. విచారణ చేసిన డివిజన్ బెంచ్ ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయడంలో ముందుకు సాగాలని తెలిపింది. అయితే నియామకాలు టీజీపీఎస్సీ, ఇతర పిటిషనర్లు దాఖలు చేసిన రిట్ అప్పీళ్లపై తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ప్రధాన పిటిషన్ల విచారణ అక్టోబర్ 15వ తేదీన జరగనుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.