Telangana Politics : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు!-supreme court issues notices to telangana mlas who defected from the party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Politics : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు!

Telangana Politics : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు!

Basani Shiva Kumar HT Telugu
Feb 03, 2025 12:10 PM IST

Telangana Politics : ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాయింపుల అంశం మరో మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

yearly horoscope entry point

రెండింటిపై విచారణ..

పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని.. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని మొదట పిటిషన్‌ వేశారు. దీంతోపాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణ జరిగే రోజే.. రెండో పిటిషన్‌పైనా విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది.

ఎంత సమయం కావాలి..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలని.. సుప్రీంకోర్టు ఇటీవల తెలంగాణ స్పీకర్‌ను కోరింది. వారం రోజుల్లోపు స్పీకర్‌ నిర్ణయాన్ని తమకు తెలపాలని.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున హాజరైన న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి సూచించింది.

హైకోర్టు తీర్పు..

తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ తగిన సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ.. గత ఏడాది నవంబరు 22న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది.

కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై..

దీన్ని సవాల్‌ చేస్తూ.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 1న జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎన్నికలు జరిగిన మూడు నెలల్లోపే పార్టీ ఫిరాయించారని వివరించారు. ఈ విషయంపై తాము స్పీకర్‌కు ఫిర్యాదు చేసి పది నెలలైనా.. ఇంతవరకు నోటీసులు కూడా జారీ చేయలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే తాము హైకోర్టును ఆశ్రయిస్తే.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఏకసభ్య ధర్మాసనం చెప్పినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పీకర్ నిర్ణయాన్ని వారం రోజుల్లోగా తెలపాలని.. తెలంగాణ శాసనసభ కార్యదర్శికి సూచించింది.

Whats_app_banner