తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం.. పిటిషనర్ వంగ గోపాల్ రెడ్డికి తెలిపింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం సూచించింది.
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తర్వాత పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టుగా చెప్పడంతో తమ పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది అంగీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్ధదవే, అభిషేక్ సింఘ్వీ, ఎడీఎన్ రావు హాజరయ్యారు. విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు వెల్లడించారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్‌ను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై స్టే ఇవ్వాలని గోపాల్‌రెడ్డి పిటిషన్ వేశారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని చెప్పారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టు వెళ్లగా.. అత్యున్నత న్యాయస్థానం తాజాగా పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టుగా చెప్పింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్ 9పై స్టే కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దక్కింది. విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరు అయ్యారు.