TGPSC Group 1 : గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ - పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
TGPSC Group 1 Exams : తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ అయిపోయింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీం తీర్పుతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఊరట లభించినట్లు అయింది.
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వానికి నోటిఫికేషన్ తో పాటు మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డంగులు తొలగిపోయినట్లు అయింది. ఇప్పటికే మెయిన్స్ పరీక్షలు కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే.
ప్రిలిమ్స్ లో తప్పులు ఉన్నాయని.. మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికతో కొత్త నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ ఊరట లభించకపోవటంతో… సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం…. నోటిఫికేషన్ రద్దు చేయటం కుదరని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఊరట లభించినట్లు అయింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రద్దు కావటంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈసారి కూడా రద్దు అయితే ఎలా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ రావటంతో… అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు అయింది.
వచ్చే ఏడాదిలోనే ఫలితాలు…!
మరోవైపు గ్రూప్ 1 ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. ఇటీవలనే మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది.
ఇదంతా కూడా పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. తుది ఫలితాలను ఫిబ్రవరి మాసంలో ప్రకటించాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది. ఇందుకు ఫిబ్రవరి 20వ తేదీలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమయం దాటినా ఆ తర్వాతి నెలలోనైనా ఫలితాలు రావొచ్చు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులను జత చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది అప్లికేషన్లు చేసుకోగా… జూన్ 9న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు ఎంపిక కాగా… వీరిలో 21,093 మంది మెయిన్స్ పేపర్లు రాశారు. వీరి ధ్రువపత్రాలను పరిశీలించి… తుది ఫలితాలను ప్రకటించనున్నారు.