Supreme Court Collegium : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలు -సుప్రీం కొలీజియం సిఫార్సు-supreme court collegium has recommended several names as judges of telangana and andhra pradesh high courts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Supreme Court Collegium : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలు -సుప్రీం కొలీజియం సిఫార్సు

Supreme Court Collegium : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలు -సుప్రీం కొలీజియం సిఫార్సు

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు జడ్జిలుగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను సూచించింది.

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలు రానున్నారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జనవరి 11వ తేదీన జరిగిన సమావేశంలో… ఈ పేర్లను సిఫార్సు చేసినట్లు ప్రకటన విడుదలైంది.

తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా జస్టిస్ రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలా దేవి, మధుసూదన రావు పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలుగా అవధానం హరిహరనాధ శర్మ, డా.యడవల్లి లక్ష్మణరావు పేర్లను సిఫార్సు చేసింది.

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజోయ్ పాల్:

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ సుజోయ్ పాల్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. తెలంగాణ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్ పాల్‌ నియామకం జరిగింది.

"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ద్వారా వచ్చిన అధికారాలను వినియోగించుకుని.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌ను.. పదవి విధులను నిర్వర్తించడానికి రాష్ట్రపతి నియమిస్తున్నారు" అని న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

జస్టిస్ సుజోయ్ పాల్ 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. ఆయన సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్, ఇతర న్యాయ శాఖలలో ప్రాక్టీస్ చేశారు. వివిధ కోర్టుల్లో పలు కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన మే 27, 2011న జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏప్రిల్ 14, 2014న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్ సుజోయ్ పాల్ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో ఆయన బదిలీ కోరుకున్నారు. జస్టిస్ సుజోయ్ పాల్ అభ్యర్థనను రాష్ట్రపతి ఆమోదించారు. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు.

సంబంధిత కథనం