Telangana Politics : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్న
Telangana Politics : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. సోమవారం విచారణ చేపట్టిన అపెక్స్ కోర్టు.. ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
బీఆర్ఎస్ తరఫున గెలిచి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై.. అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ.. కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
ముకుల్ రోహత్గీ వాదనలు..
తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లను కేటీఆర్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంలో విచారణ సమయంలో.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఇంకెంత గడువు కావాలి..
స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని ముకుల్ రోహత్గీ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. సభాపతితో చర్చించి వివరాలు అందిస్తామని వివరించారు. దీంతో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని.. ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది. అటు ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
త్వరలో ఉప ఎన్నికలు..
ఫిరాయింపుల వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కేటీఆర్ చేసిన బై ఎలక్షన్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. 'రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యం. నా తోటి బీఆర్ఎస్ పార్టీ సైనికులారా.. త్వరలో ఉప ఎన్నికలలో పోరాడటానికి మనం సిద్ధంగా ఉందాం' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కడియం కామెంట్స్..
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. త్వరలో తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని.. అందులో వెనక్కి పోయేదిలేదన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
ప్రోత్సహించిందే బీఆర్ఎస్..
'బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు చేస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. అప్పట్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు సుద్దపూసల్లాగా మాట్లాడుతున్నారు. ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు. గులాబీ పార్టీ చేస్తే సంసారం.. వేరే పార్టీ చేస్తే వ్యవభిచారమా?' అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.