సున్నం చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా స్పీడప్ చేసింది. ఈ క్రమంలో ఫుల్ ట్యాంక్ పరిధిలో మిగిలిన ఆక్రమణలను సోమవారం తొలగించింది. విషతుల్యం అని తెలిసినా.. సున్నం చెరువు ఆవరణలో బోర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంది. పదుల సంఖ్యలో ఉన్న బోర్లను తొలగించడమే కాకుండా.. ట్యాంకర్లను సీజ్ చేసింది. బోర్లుకు ఆనుకుని వేసిన షెడ్డులను కూడా హైడ్రా తొలగించింది. పీసీబీ ద్వరా పరీక్షలు చేయించి.. అక్కడి నీరు చాలా ప్రమాదకరమని వివరించినా పట్టించుకోకుండా నీటి దందా చేస్తున్నవారిపై కేసులు పెట్టింది. ఎవరి ఆరోగ్యాలు ఎలా పాడైనా ఫర్వాలేదు.. తన నీటి వ్యాపారం కొనసాగడమే చాలు అని హైడ్రా విదులకు ఆటంకం కలిగిస్తున్న వెంకటేష్‌పై మాధాపూర్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వెంకటేష్‌ను మాధాపూర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.
1970లో సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్‌ల ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు. ఈ క్రమంలోనే 2016లో హెచ్ ఎండీఏ ఈ చెరువు విస్తీర్ణాన్ని 32 ఎకరాలుగా పేర్కొంటూ ప్రాథమికంగా నిర్ధారించింది. అలాగే 2014లో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖలు నిర్ధారించిన హద్దుల మేరకే నగరంలో చెరువుల పునరుద్ధరణ జరుగుతోంది.
సున్నం చెరువు విషయంలో కూడా అలాగే అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా స్పష్టం చేసింది. అందుకే అక్కడ గతంలో వేసిన లే ఔట్‌ను ఏళ్లక్రితం హుడా రద్దు చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నందునే అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి 10 ఏళ్లుగా అనుమతులు ఇవ్వడంలేదు.కోర్టు కేసుల్లో ఈ అంశం ఉందని అక్కడి ప్లాట్ యజమానులు చెబుతున్నారు. ఒక వేళ ఎవరైనా నష్టపరిహారానికి అర్హులమని భావిస్తే వెంటనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని హైడ్రా సూచించింది. అలాగే టీడీఆర్ ( ట్రాన్సఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కింద కూడా చట్ట ప్రకారం నష్టపరిహారం పొందవచ్చునని పేర్కొంది.
బోరు బావుల నీరు విషతుల్యమని తెలిసినా వెంకటేష్ నేతృత్వంలో అక్కడ నీటి వ్యాపారం కొనసాగుతోంది. వెంకటేష్‌కు చెందిన షెడ్డులో లక్షలాది రూపాయల నగదును మాధాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సిండికేట్‌గా నీటి వ్యాపారం చేయించడమే కాకుండా.. అక్కడే మందు పార్టీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఏకంగా చెరువు పరిధిలో బోర్లు వేసినట్టు అక్కడి మోటార్లు, వాటికి అమర్చిన ప్లాస్టిక్ పైపులు రుజువు చేస్తున్నాయి.
దుర్గంధభరితంగా మారిన సున్నం చెరువు చెంత ఉన్న బోర్లలో ప్రమాదకర రసాయనాలు, భార లోహాలైన సీసం, కాడ్మియం, నికెల్ ఉందని.. ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైడ్రా గతంలోనే హెచ్చరించింది. ఈ మేరకు పీసీబీ ఇచ్చిన నివేదికను కూడా బయట పెట్టింది. క్యాన్సర్, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో పాటు.. కిడ్నీలు పాడౌతాయని.. గర్భస్రావాలు కూడా అవుతాయని హెచ్చరించింది. అయినా ఆ నీటిని తాగునీటిగా హాస్టళ్లు, నివాసాలకు, కార్యాలయాలకు సరఫరా చేస్తూనే ఉన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్న బోర్లను పూర్తిగా తొలగించింది.
మాదాపూర్ ఐటీకారిడార్‌కు చేరువగా.. బోరబండ బస్తీకి ఆనుకుని.. గుట్టలబేగంపేట వద్ద ఉన్న సున్నం చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువులో కొన్ని దశాబ్దాలుగా రెండు మూడు మీటర్ల మేర పోగైన ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు చెత్తను హైడ్రా తొలగించింది. చెరువులోకి మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలాలను ఏర్పాటు చేసింది. వర్షపు నీరు సులభంగా చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్‌లు నిర్మించే పనులకు కూడా శ్రీకారం చుట్టింది.
అలాగే పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రెన్స్ పార్కు, ఓపెన్ జీమ్‌లను ఏర్పాటు చేసి.. పరిసర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు తీసుకుంటోంది. దోమలు, క్రిములు, కీటకాలతో దుర్గంధ భరితంగా ఉన్న వాతావరణం తొలగిపోవడంతో అక్కడ ఇంటి కిరాయిలు పెరిగాయి. ఇంటి స్థలాల ధరలు కూడా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే మాకు ఎంతో ఊరటని స్థానికులంటున్నారు. ఈ వర్షాకాలంలోనే చెరువును పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి హైడ్రా చకచకా పనులు సాగిస్తోంది.