Boy Suicide: నచ్చిన కటింగ్ చేయించలేదని తొమ్మిదేళ్ల బాలుడి ఆత్మహత్య, మహబూబాబాద్‌లో విషాదం
Boy Suicide: ఉమ్మడి వరంగల్ లోని మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేని హెయిర్ కట్టింగ్ చేయించడంతో తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Boy Suicide: ఉమ్మడి వరంగల్ లోని మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. తనకు ఇష్టం లేని హెయిర్ కట్టింగ్ చేయించాడని తండ్రి మీద కోపంతో ఓ తొమ్మిదేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృత్యువుతో పోరాడిన ఆ బాలుడు గురువారం ప్రాణాలు విడిచాడు. ఘటనకు సంబంధించిన వివరాలు బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న వాడైన ఈసం హర్షవర్థన్(9) సీతా నాగారంలోని హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదివాడు.
వేసవి కాలం సెలవుల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలాఉంటే మే 25వ తేదీన ఈసం కాంతారావు తన కొడుకైన హర్షవర్ధన్ ను హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఉన్న సెలూన్ షాప్ నకు తీసుకెళ్లాడు.
అక్కడ తండ్రి కాంతారావు చెప్పిన ప్రకారం సెలూన్ షాప్ వ్యక్తి హర్షవర్ధన్ కు కటింగ్ చేయగా, అది ఆ బాలుడికి నచ్చలేదు. దీంతో తనకు నచ్చిన విధంగా కట్టింగ్ చేయించలేదని, ఆ స్టైల్ తనకు నచ్చలేదని తండ్రితో హర్ష వర్ధన్ గొడవ పడ్డాడు.
ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాటం
హర్షవర్ధన్ కటింగ్ నచ్చలేదని గొడవ చేస్తుండటంతో చదువుకునే అబ్బాయికి హెయిర్ అలాగే ఉండాలని తండ్రి కాంతారావు నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు. కానీ హర్షవర్ధన్ ఎంతకూ వినకపోగా, అలాగే ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఇంటి వెనకాల ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా, హర్ష వర్ధన్ వాంతులు చేసుకుంటున్నట్లుగా శబ్దాలు వినిపించాయి.
దీంతో కాంతారావు వెంటనే ఇంట్లోకి వచ్చి చూడగా, హర్షవర్ధన్ వాంతులు చేసుకోవడం కనిపించింది. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ అసలేం జరిగిందని ఆరా తీశారు. చివరకు తనకు నచ్చని కటింగ్ చేయించినందు వల్ల అది ఇష్టం లేక పురుగుల మందు తాగినట్లు హర్షవర్ధన్ అసలు విషయాన్ని బయట పెట్టాడు.
దీంతో ఆ బాలుడిని వెంటనే అక్కడి నుంచి నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే హర్ష వర్ధన్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో అక్కడి డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారు. కానీ ఎంతకూ నయం కాకపోవడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలోనే హర్ష వర్ధన్ పరిస్థితి విషమించి గురువారం ఉదయం 8 గంటల సుమారులో ప్రాణాలు కోల్పోయాడు.
మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గంగారం ఎస్సై బి.రవికుమార్ వివరించారు. కాగా చిన్నపాటి విషయానికే బాలుడు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోగా, బాధిత కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించగా, చింతగూడెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం