Kakatiya University : కాకతీయ యూనివర్సిటీలో గ్యాంగ్ వార్..! 22 మంది విద్యార్థులపై కేసు నమోదు-students clash in warangal kakatiya university police case registered against 22 students ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kakatiya University : కాకతీయ యూనివర్సిటీలో గ్యాంగ్ వార్..! 22 మంది విద్యార్థులపై కేసు నమోదు

Kakatiya University : కాకతీయ యూనివర్సిటీలో గ్యాంగ్ వార్..! 22 మంది విద్యార్థులపై కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Published Feb 08, 2025 08:12 AM IST

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మొత్తం 22 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు యూనివర్శిటీ అధికారులు రెడీ అవుతున్నారు.

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ...!
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ...!

కాకతీయ యూనివర్సిటీలో గ్యాంగ్ వార్ జరిగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. కేయూ కామన్ మెస్ లో ఈ ఘటన జరగగా.. గొడవకు పాల్పడిన 22 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కేయూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.వి.రాంచంద్రం, ఇతర ఉన్నతాధికారులు కామన్ మెస్ ను విజిట్ చేసి విచారణ జరిపారు.

ఏం జరిగిందంటే…?

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కామన్ మెస్ లో శుక్రవారం మధ్యాహ్నం సయమంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కు చెందిన సీనియర్, జూనియర్ విద్యార్థులు లంచ్ కోసం వెళ్లారు. అక్కడ భోజనం చేసే సమయంలో విద్యార్థుల మధ్య సీనియర్, జూనియర్ వార్ మొదలైంది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు ప్లేట్లు, చేతికందిన వస్తువులతో దాడులు చేసుకున్నారు.

కోపోద్రిక్తులైన విద్యార్థులు పిడిగుద్దులకు దిగారు. ఈ ఘటనలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కన్నుపై, రెండో ఏడాది విద్యార్థి వీపుపై, మరో విద్యార్థికి కడుపు, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గొడవ ధాటికి మూర్ఛతో కూప్పకూలాడు. పక్కనే ఉన్న విద్యార్థులు క్యాంపస్ లోని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. అక్కడున్న మెస్‌ సిబ్బందితో పాటు తోటి విద్యార్థులు వారిని అడ్డుకుని శాంతింప చేశారు.

హాస్టల్ లోనూ గొడవ…

కామన్‌ మెస్‌లో జరిగిన గొడవను అక్కడున్న సిబ్బంది తోటి విద్యార్థులు సద్దుమణిగించగా.. ఆ తరువాత సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు మధ్య ఘర్షణ సాయంత్రం వారుంటున్న గణపతిదేవ–2 హాస్టల్‌కు చేరింది. అక్కడ మళ్లీ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. మెస్‌లో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని మరోసారి హాస్టల్‌ ఎదుట విద్యార్థులు బాహాబాహీకి దిగారు.

విద్యార్థుల గొడవ విషయం తెలుసుకున్న వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రాంచంద్రం, క్యాంపస్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ బి.సురేశ్‌ లాల్‌, కేయూ హాస్టల్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎల్‌పీ రాజ్‌ కుమార్‌, కేయూ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ హెచ్వోడీ ప్రొఫెసర్‌ ఎన్‌.వాసుదేవారెడ్డి హుటాహుటిన గణపతిదేవా హాస్టల్ కు చేరుకున్నారు. గొడవలో గాయపడిన విద్యార్థులతో పాటు ఇతరులతో పాటి మాట్లాడి వివరాలు సేకరించారు. గొడవకు దిగిన ఇంటిగ్రేటెడ్‌ విద్యార్థులతో పాటు కొంతమంది స్టూడెంట్‌ యూనియన్లకు చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేయూ స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరస్పర దాడుల నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు మోహరించారు.

22 మందిపై కేసులు…

కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో పరస్పరం గొడవ పడి దాడులకు దిగిన ఘటనలో 22 మంది విద్యార్థులపై కేయూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 11మందితో పాటు ఏబీవీపీకి చెందిన ముగ్గురు విద్యార్థి నాయకులు, ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న మరో 8 మందిపై కేసులు నమోదు చేశారు.

పరస్పరం దాడుల ఘటనలో విద్యార్థులు ఒకరిపై మరొకరు చేసిన ఫిర్యాదుల మేరకు రెండు వర్గాల విద్యార్థుల మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. కాగా వర్సిటీలో గొడవకు కారణమైన విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ అధికారులు రెడీ అవుతున్నారు. ఈ మేరకు గొడవ, దాడికి దారి తీసిన పరిస్థితిపై ఆరా తీసి, శనివారం వర్సిటీలో విచారణ చేపట్టనున్నారు. అనంతరం దాడికి పాల్పడిన విద్యార్థులను సస్పెండ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

Whats_app_banner

సంబంధిత కథనం