Karimnagar landgrabbers: కరీంనగర్ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు
Karimnagar landgrabbers: కరీంనగర్ లో భూ కబ్జాదారుల్లో 9 మంది నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భూమాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుడంటంతో నిందితులు వణికిపోతున్నారు.
Karimnagar landgrabbers: కరీంనగర్‌లో అమాయకుల నుంచి బలవంతంగా ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు కేసులకు సంబంధించిన నిందితులు పరారీలో ఉండగా గత నెలలో అరెస్టు అయిన ఒక గ్యాంగ్ కు చెందిన ఐదుగురు మరో గ్యాంగ్ కు చెందిన నలుగురిని 24 గంటల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. నిందితుల ఇళ్ళలో సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కస్టడీలో బుల్డోజర్ గ్యాంగ్…
కరీంనగర్ లో నకిలీ వపత్రాలు సృష్టించి అక్రమ భూ దందాల వ్యవహారంలోఅరెస్టైన బుల్డోజర్ గ్యాంగ్ ను పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో బుల్డోజర్ గ్యాంగ్ కు చెందిన నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
వారి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వరకు పోలీస్ కస్టడీలోనే బుల్డోజర్ గ్యాంగ్ ఉంటుంది. నకిలీ ధృవ పత్రాలతో భూ ఆక్రమణకు పాల్పడడమే కాకుండా ఇంట్లోకి చొరబడి ఇల్లు కూల్చారని భయ బ్రాంతులను గురి చేశారని ఆదర్శనగర్ కు చెందిన మొహమ్మద్ లతీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు.
బుల్డోజర్ గ్యాంగ్ కు చెందిన బారాజు రత్నాకర్ రెడ్డి, చందా శంకర్ రావు, బకిట్ సాయి, పిట్టల మధు, షాహిద్ ఖాన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కీలక సమాచారం సేకరించేందుకు నలుగురు నిందితులని కోర్టు అనుమతి ద్వారా గురువారం కొత్తపల్లి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న ఐదుగురు నిందితులను విచారణతో పాటు ఇళ్లల్లో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.
మరో కేసులో మున్సిపల్ ఆర్ఐ..
నకిలీ దృవపత్రాలు సృష్టించి వాటినే నిజమైనవిగా చూపించి ఇంటిస్థలాన్ని కాజేయడమే కాకుండా విక్రయదారులను బెదిరించి డబ్బు దోపిడీకి పాల్పడిన కేసులో 18 వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి తో పాటు ఆమె భర్త కృష్ణ గౌడ్, కొత్త జైపాల్ రెడ్డిలతో పాటు మున్సిపల్ ఆర్ ఐ/ సీనియర్ అసిస్టెంట్ జంకే శ్రీకాంత్ , మున్సిపల్ బిల్ కలెక్టర్ కొత్తపల్లి రాజు తో సహా మొత్తం 12 మంది పై కొత్తపల్లి పోలీసుస్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఈ కేసులో ఇప్పటికే నలుగురు మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ , కాంపెల్లి రామాంజనేయులు, జంకే శ్రీకాంత్ (మున్సిపల్ ఆర్ఐ ), కొత్తపల్లి రాజు లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నలుగురు నిందితులను కోర్టు అనుమతి ద్వారా గురువారం కొత్తపల్లి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న నలుగురు నిందితులను విచారణతో పాటు ఇళ్లల్లో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకున్నామని సిఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.
తప్పించుకునేందుకు విదేశాలకు జంప్
భూకబ్జా కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురు విదేశాల బాట పడుతున్నారు. వరుస అరెస్టులు నిందితుల గుండెల్లో గుబులు రేపుతుండ గా పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపిస్తారన్న భయంతో ఫారిన్ చెక్కేద్దామంటూ ఫ్లైట్లు ఎక్కేస్తున్నారు. దీంతో విదేశాలకు వెళ్తున్న నిందితులపై పోలీసులు దృష్టిసారించారు. కేసుల్లో ఉన్న పలువురు నాయకులు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
భూ దందాల్లో ఆయా పార్టీలకు చెందిన పలువురి పాత్ర ఉండటం.. ఎన్నికల సమయంలో అరెస్టు చేస్తే ప్రచారంపై ప్రభావం పడుతుందని, ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగా మారుతుందని భయపడుతున్నారు. అలాంటి వారిని ఎన్నికలు ముగిసే వరకు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా పార్టీల నేతలే చెబుతున్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలోనూ భూ కబ్జా ఫిర్యాదులు కరీంనగర్ కమిషనరేటు కు భారీగా వస్తున్నాయి. బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటూ న్యాయం చేయాలని సీపీ అభిషేక్ మహంతికి విన్నవిస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫిర్యాదుల స్వీకరణ నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
గతంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుండటంతోపాటు అరెస్టులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భూ దందాల్లో కీలక పాత్ర ఉండి, విదేశాలకు వెళ్లినట్లు తెలిసిన నాయకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో 2,700కు పైగా ఫిర్యాదులు రాగా, వాటిలో సుమారు 35కు పైగా కేసులు నమోదవగా, మరికొన్ని విచారణ దశలో ఉన్నాయి.
భూ అక్రమాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటం, వాటిల్లో ప్రధాన నిందితులుగా ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులే ఉండటంతో కీలక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.
భూ కబ్జా కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురు నాయకులు అరెస్టు భయంతో విదేశాలకు వెళ్తున్నారు. దీనిపై పోలీసులు వివరాలు సేకరించే క్రమంలో వారి కుటుంబసభ్యుల నుంచి స్పందన ఉండటం లేదు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే అవకాశాలపై పరిశీలిస్తున్నారు.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, కరీంనగర్)