రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. మొత్తం 3 విడుతల్లో ఎన్నికలను పూర్తి చేస్తామని ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా.. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
అక్టోబర్ 9, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషేన్ విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 11వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. ఈ ప్రక్రియకు సమయం కూడా దగ్గరపడింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, సందేహాల నివృత్తి, ఎన్నికల సంబంధిత సమాచారాన్ని వెల్లడించడానికి ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 9240021456 ఫోన్ నంబర్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చని సూచించింది. ఈ నెంబర్ నిరంతరాయంగా పని చేస్తుందని ఈసీ పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా 1,12,280 వార్డులు ఉన్నాయి. 81,61,984 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.ఎన్నికల నిర్వహణ కోసం 15,302 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది.
పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లపై కూడా ఈసీ కీలక ఆదేశాలను ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై అనుచిత ప్రభావాన్ని నివారించడానికి అధికార, రాజకీయ హోదాలు ఉన్నవారిని పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం