Fine On Kolors Health Care : బరువు తగ్గిస్తామని మోసం చేశారని యువతి ఫిర్యాదు, కలర్స్ సంస్థకు వినియోగదారుల కోర్టు జరిమానా
Fine On Kolors Health Care : కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. బరువు, కొవ్వు తగ్గిస్తామంటూ కలర్స్ సంస్థ తనను మోసం చేసిందని ఓ యువతి ఫిర్యాదుతో కోర్టు ఈ సంస్థకు జరిమానా విధించింది.
Fine On Kolors Health Care : బరువు, కొవ్వు తగ్గిస్తామంటూ కలర్స్ హెల్త్ కేర్ సంస్థ తనను మోసం చేసిందని సంగారెడ్డికి చెందిన ఓ యువతి వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు...కలర్స్ హెల్త్ కేర్ సంస్థకు జరిమానా విధించింది. యువతి చెల్లించిన రూ.1,05,000 ఫీజును 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని కలర్స్ సంస్థను ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పును కలర్స్ హెల్త్ కేర్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ లో అప్పీల్ చేసింది. వినియోగదారుల కమిషన్ ఈ అప్పీల్ ను కొట్టేసింది.

కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి కలర్స్ హెల్త్ కేర్ సంస్థ తగిన అనుమతులు తీసుకోలేదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ సంస్థకు ఉన్న అనుమతులపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ డీఎంహెచ్‌వో, వైద్య విధాన పరిషత్ డైరెక్టర్‌ను ఆదేశించింది.
గతేడాది ఇలాంటి ఘటనే
గతేడాది మే నెలలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. బరువు, కొవ్వు తగ్గిస్తామంటూ ప్రకటన చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది కలర్స్ సంస్థ. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఆరోగ్యం పాడవడానికి కారణమైనందుకు రూ. 1.30 లక్షలు 12 శాతం వడ్డీతో పాటు, కోర్టు ఖర్చులు రూ. 5,000 వినియోగదారుడికి రీఫండ్ చేయాలని జిల్లా వినియోగదారుల కోర్టు కలర్స్ హెల్త్ కేర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లంగర్ హౌస్‌కు చెందిన ఆటో రిక్షా డ్రైవర్ రాంబాబు బరువు తగ్గే చికిత్స కోసం కలర్స్ హెల్త్ కేర్‌ను సంప్రదించారు. ముందుగా రూ. 500, ఇతర ఛార్జీల పేరుతో అతడు రూ. 5,000 చెల్లించాడు. బరువు తగ్గించేందుకు కలర్స్ హెల్త్ కేర్ అతడికి రూ.1.30 లక్షల ప్యాకేజీ నిర్ణయించింది.
రాంబాబు వద్ద తగినంత డబ్బు లేకపోవడంతో...కలర్స్ హెల్త్ కేర్ సిబ్బంది లోన్ సదుపాయాన్ని అందించింది. ఓ సంస్థ నుంచి రాంబాబుకు 1.30 లక్షల రూపాయలకు రుణాన్ని అందించారు. 12 నెలల పాటు ప్రతి నెలా రూ.14,000 ఈఎంఐ చెల్లించాలని కలర్స్ సిబ్బంది రాంబాబుకు చెప్పారు. సరేనన్న అతడు బరువు తగ్గేందుకు 2-3 సెషన్ల చికిత్సకు హాజరయ్యాడు. చికిత్స సమయంలో రాంబాబుకి వెన్ను నొప్పిగా అనిపించి చికిత్స నిలిపివేయాలని కోరారు. అయితే వెన్ను నొప్పి సహాజమేనని కలర్స్ సంస్థ పేర్కొంది. నొప్పి తీవ్రం అవ్వడంతో రాంబాబు బరువు తగ్గే చికిత్సను నిలిపివేశారు. తన ఆరోగ్యం క్షీణించడానికి కలర్స్ సంస్థ కారణమని రాంబాబు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కోర్టు కలర్స్ సంస్థకు జరిమానా విధించింది.
సంబంధిత కథనం