Narayanapet Police: సినిమా డైరెక్టర్‌ కావాలని చోరీలు చేస్తూ జల్సాలు.. తెలంగాణ పోలీసులకు చిక్కిన సిక్కోలు యువకుడు-srikakulam youth arrested for theft in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Narayanapet Police: సినిమా డైరెక్టర్‌ కావాలని చోరీలు చేస్తూ జల్సాలు.. తెలంగాణ పోలీసులకు చిక్కిన సిక్కోలు యువకుడు

Narayanapet Police: సినిమా డైరెక్టర్‌ కావాలని చోరీలు చేస్తూ జల్సాలు.. తెలంగాణ పోలీసులకు చిక్కిన సిక్కోలు యువకుడు

Sarath chandra.B HT Telugu
Jul 26, 2024 08:37 AM IST

Narayanapet Police: సినిమా డైరెక్టర్ కావాలనుకున్న యువకుడు దారి తప్పాడు. చోరీలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో జల్సాలు ప్రారంభించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న నారాయణ పేట పోలీసులు
చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న నారాయణ పేట పోలీసులు

Narayanapet Police: సినిమా డైరెక్టర్‌ కావాలనుకున్న ఓ శ్రీకాకుళం యువకుడు దారి తప్పాడు. వరుస చోరీలతో పోలీసుల్ని హడలెత్తించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 చోరీలకు పాల్పడ్డాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

వరుస చోరీలతో తెలంగాణ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పల నాయుడు వరుస చోరీలతో హడలెత్తించాడు. మూడోకంటికి తెలియకుండా చోరీలు చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. చివరకు నారాయణ పేట పోలీసులకు దొరికిపోయాడు.

ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ కొట్టేసిన బంగారం, నగదుతో జల్సాలు చేస్తున్న యువకుడు చివరకు కటకటాల పాలయ్యాడు. నిందితుడి విచారణలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలనాయుడు కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఇళ్లలో అంతా నిద్రించిన సమయంలో లోపలకు ప్రవేశించి అందినకాడికి దోచుకునే వాడు. ఇలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లోజల్సాలు చేసేవాడు. నిందితుడు సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో సొంతూరి నుంచి హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సినిమాల మీద ఆసక్తితో గతంలో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కూడా చిత్రీకరించినట్టు గుర్తించారు.

తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన చిగుళ్లపల్లి రాఘవేందర్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఈ ఘటనలో 41.5 తులాల బంగారం అపహరణకు గురైంది. , మరికల్‌కు చెందిన గౌడపల్లి రాములు ఇంటిలో 20 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెంటి ఆభరణాలు, రూ.4లక్షల నగదు చోరీకి గురయ్యాయి. నారాయణపేటలోని అశోక్ నగర్‌‌కు చెందిన అబ్రేష్ కుమార్‌ ఇంట్లో 2.5 తులాల బంగారం చోరీ జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలు జరిగాయి. ఈ కేసులపై దర్యాప్తు చేసిన పోలీసులకు అప్పలనాయుడిని నిందితుడిగా గుర్తించారు.

నిందితుడి నుంచి 75 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ.4 లక్షల నగదును రికవరీ చేసినట్లు తెలంగాణాలోని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అప్పలనాయుడు వివరాలను వెల్లడించారు. అప్పల నాయుడు దొంగతనాల్లో ఆరితేరిపోయాడని, ఇంట్లో మనుషులు ఉండగానే చాకచక్యంగా చోరీలకు పాల్పడే వాడని తెలిపారు.

చోరీ చేసిన డబ్బులతో హైదరాబాద్, రాయచూర్‌లలో పేకాట ఆడుతూ, జల్సాలు చేస్తున్నాడని వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 90 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని గతంలో కూడా అతనిపై కేసులు ఉన్నాయని తెలిపారు. చోరీ చేసిన డబ్బుతో గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడని, సినిమా డైరెక్టర్ కావాలని శ్రీకాకుళం నుంచి వచ్చినట్టు ఎస్పీ తెలిపారు. చోరీ కేసులను ఛేదించిన పోలీసులకు రివార్డులు అందించారు.

Whats_app_banner