అర్చక, ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు.. మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం-special welfare fund launched and gratuity increase 4 to 8 lakh rupees for temple priests and employees in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అర్చక, ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు.. మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

అర్చక, ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు.. మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Anand Sai HT Telugu

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. రాష్ట్రంలోని ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి సురేఖ చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు.

మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

లయాల్లో సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. తాజాగా మంత్రి కొండా సురేఖ అర్చక సంక్షేమ నిధి పోస్టర్‌ను విడుదల చేశారు. అర్చకులు, ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతున్నట్టుగా చెప్పారు.

అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా 13700 మందికి లబ్ధి చేకూరనుంది. మరణం తర్వాత లేదా రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ చెల్లింపు ఉంటుంది. మెడికల్ రీయింబర్స్‌మెంట్, వివాహ, గృహ నిర్మాణ, విద్యా పథకాలు కూడా అందిస్తారు. ఇది అర్చకులు, ఉద్యోగుల ఆర్థిక భద్రతకు సాయపడుతుంది.

ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించే గ్రాట్యూటీని నిర్ధారించారు. మరణం తర్వాత చెల్లించే ఎ్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం నిధి ఉపయోగపడుతుంది. ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు, మరమ్మతుల నిమిత్త పథక, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థియ సాయం అందజేస్తారు. అకాల మరణం చెందితే అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం ఇచ్చే రూ.20వేలను రూ.30 వేలకు పెంచారు.

గ్రాట్యుటీ రూ 4 లక్షల నుండి రూ 8 లక్షలకు పెంపుపై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. విద్య, వైద్యం, వివాహ గ్రాంట్, ఉపనయన గ్రాంట్, దహన ఖర్చులు, గ్రాట్యుటీ, అంగవైకల్యానికి ఆర్థిక సహాయం వంటి పథకాలను అర్చక సంక్షేమ నిధి ద్వారా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.