Observatory: కళ్ల ముందే ఖగోళ ప్రపంచం.. ఎక్కడో కాదు హైదరాబాద్ పక్కనే..-special story on japal rangapur observatory ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Special Story On Japal Rangapur Observatory

Observatory: కళ్ల ముందే ఖగోళ ప్రపంచం.. ఎక్కడో కాదు హైదరాబాద్ పక్కనే..

Mahendra Maheshwaram HT Telugu
May 05, 2022 02:50 PM IST

జాపాల - రంగాపూర్ అబ్జర్వేటరీ సింపుల్ గా జేఆర్ఓ అనొచ్చు...! ఇదంటేనే ఓ ఖగోళ ప్రపంచం. పగలు.. రాత్రి.. ఆకాశం.. చుక్కలు.. సూర్యుడు, చంద్రుడు... ఇక్కడ చూసేవి ఇవే... మాట్లాడుకోవాల్సింది కూడా వీటి గురించే. అబ్జర్వేటరీ అసలు ముచ్చట తెలుసుకోవాలంటే.. హైదరాబాద్ కు పక్కనే ఉన్న రంగాపూర్ వైపు టర్న్ కావాల్సిందే..!

జాపాల - రంగాపూర్ అబ్జర్వేటరీ
జాపాల - రంగాపూర్ అబ్జర్వేటరీ

japal rangapur observatory: అప్పటి వరకు విశాలమైన మైదాన ప్రాంతం... మధ్య మధ్యలో పచ్చని పైర్లు... కొన్నిచోట్ల పండ్ల తోటలు.. ఇక్కడే ఓ పెద్ద కొండ... మధ్యలో చూస్తే తెల్లటి రంగులో ఓ పెద్ద గ్లోబ్.. ఏదీ మన ఆదిత్య 369 సినిమాలో చూపించే గ్లోబ్ లా కనిపిస్తూ ఉంటుంది. చూస్తే అదేంటి.... ఈ గుట్టల మధ్య ఇలా ఎందుకు కట్టారనే డౌట్ రావటం మాత్రం పక్కా..! కానీ అదేదో అషామాషీ గ్లోబ్ కాదండోయ్...! ఎన్నో ఖగోళ రహస్యాలను బయటపెట్టిన హిస్టరీ ఆ గ్లోబ్ సొంతం..! నిజాం నవాబ్ వేసిన ఆ పునాది.. చాలా చరిత్రతోనే ముడిపడి ఉంది. మైళ్ల దూరంలో ఉండే నక్షత్రాలను మనం తాకినట్లు.. జాబిల్లి రావే చందమామ రావే అనే చంద్రుడిని మన దగ్గరికే పిలిచినట్లు.. ఇలా ఒకటా రెండా... ఎన్నో వింతలు విశేషాలను తనలో పైలంగా దాచిపెట్టుకుని దశాబ్దాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిసోంది ఈ జేఆర్ఓ సెంటర్…!

ట్రెండింగ్ వార్తలు

జేఆర్ఓ ఏర్పాటు...

నిజానికి తొలుత జేఆర్ఓ లేదు. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్.. 1907వ సంవత్సరంలో బేగంపేటలో నిజామియా అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది ఉస్మానియా వర్శిటీ పరిధిలోకి వెళ్లింది. అయితే ఖగోళ పరిశోధనలకు అనువుగా ఎత్తైన ప్రాంతం ఉండాలి. ఈ పరిస్థితుల్లో ఈ అబ్జర్వేటరీని హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో ఉన్న రంగాపూర్ - జాపాల గ్రామాల మధ్య ఓ పెద్ద కొండపైకి షిఫ్ట్ చేశారు. 200 ఎకరాల్లో ఉంటుంది. అప్పట్లోనే రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇదంతా 1960 తరువాత జరిగింది. నిజానికి ఈ ప్రాంతం.. హైదరాబాద్ కంటే చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఫలితంగా పరిశోధనలకు మరింత అనుకూలంగా మారింది. రెండు గ్రామాల పేరుతో వచ్చేలా దీనికి జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీగా పేరు పెట్టారు. స్థానికులు ఎక్కువగా ‘చుక్కపురి పట్నం’ అని పిలుస్తారు.

దక్షిణాసియాలోనే రెండోది..

జేఆర్ఓ ఏర్పాటు చేసిన కొద్దిరోజుల్లోనే సరికొత్త ఫలితాలను రాబట్టగలిగింది. అమెరికన్ శాత్రవేత్తలు కూడా ఇక్కడికి క్యూ కట్టారు. నిరంతం టెలిస్కోప్ తో నక్షత్రాలు, గ్రహాల్ని తిలకించటం మొదలుపెట్టారు. ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ అస్ట్రానమితో పాటు పలు ప్రఖ్యాత సంస్థలు కూడా ఈ సెంటర్ పై ఆసక్తిని చూపాయి. ఎన్నో ఆసక్తిరమైన విషయాలతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకున్న జేఆర్ఓ... 48 ఇంచుల టెలిస్కోప్ ఉండటంతో సౌత్ ఆసియాలోనే రెండో స్థానంలో నిలిచింది.

ఆరోజు ఇక్కడ్నుంచే పంపారు...

అది 1983 సంవత్సరం.. ఫిబ్రవరి 16వ తేదీ... ఆకాశంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎటుచూసినా చీకటే. పల్లెల్లన్నీ చీకట్లు కమ్ముకున్నాయి. స్కైలాబ్ పడుతుందని.. ఏకంగా లోకమే ఉండదనే వార్తలు కూడా వ్యాప్తి చెందాయి. అయితే జేఆర్ఓ లో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. పదుల సంఖ్య సీనియర్ శాస్త్రవేత్తలు.. వందల మంది సిబ్బందితో వెలుగులతో జిగేల్ మని మెరుస్తున్నది. ఇక్కడ ఉన్న పెద్ద టెలిస్కోప్ తో గ్రహాలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి విపత్తు రాబోదని.. ఆకాశంలో అంతా మాముూలుగానే ఉందని.. సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడిందని ఛాయాచిత్రాలు తీసింది. ఫలితంగా ఖగోళ ప్రపంచంలో తనకంటూ ఓ పేజీని లిఖిచుకుంది జేఆర్ఓ.

ఇలా ఒక్కటే కాదు..1984-86 మధ్య కాలంలో హేలీ తోక చుక్కపై పరిశోధనలు, 1994లో షూమేకర్ లేవీ ప్రభావంపై కూడా పలు అంశాలను ఈ సెంటర్ నుంచి రికార్డు చేశారు. దాదాపు ఇక్కడ పరిశోధనలకు సంబంధించి.. 123 వ్యాసాలు అంతర్జాతీయ, జాతీయ పబ్లికేషన్లలో ప్రచురితమమయ్యాయి. వందలాది మంది పీహెచ్డీ విద్యార్థులు...ఈ సెంటర్ పాత్రపై కూడా వారి పరిశోధన టాపిక్ గా ఎంచుకున్నారు.

నాడు సూపర్.. నేడు మాత్రం....

నాడు నిత్యం పరిశోధనలు.. శాస్త్రవేతలతో ఎంతో బిజీగా ఉండే ఈ క్షేత్రం.. ప్రస్తుత పరిస్థితి అంతలా లేదు. అప్పుడు ఏర్పాటు చేసిన 48 ఇంచుల టెలిస్కోప్ ప్రస్తుతం పని చేయటం లేదు. ఇక 12 ఇంచుల రెండు టెలిస్కోప్ లు మాత్రం పని చేస్తున్నాయి. పెద్ద టెలిస్కోప్ మరమ్మత్తు చేయాలంటే.. వాటి పరికరాలు దొరకటం కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇక్కడ అభివృద్ధి కూడా అంతంతే ఉంది. కొద్ది రోజుల కిందట.. రూసా పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేందుకు యత్నించారు. వర్శిటీ నిధులతో అభివృద్ధి చేసే పరిస్థితి కూడా అంతంతే ఉంది. ఇక్కడ వర్శిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా స్థానికంగా ఉంది.

<p>జేఆర్ఓ సెంటర్ వద్ద ఖగోళ శాస్త్ర విద్యార్థులు (ఫైల్ ఫోటో)</p>
జేఆర్ఓ సెంటర్ వద్ద ఖగోళ శాస్త్ర విద్యార్థులు (ఫైల్ ఫోటో) (Facebook)

ఏం చూపిస్తారు...

ఇదంతా ఆదిత్య 369 సినిమాలో చూపించే గ్లోబ్ లా ఉంటుంది. లోపల ఉండే టెలిస్కోప్ తో నక్షత్రాలను చూపిస్తారు. ఎన్నో మైళ్ల దూరంలో ఉండే నక్షత్రాలు మనం చేతితో పట్టుకునే అంత దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి.ఇక ఖగోళ శాస్త్రంలో ఎంఎస్సీ చేసే విద్యార్థులు.. ప్రాక్టికల్స్ లో భాగంగా ఇక్కడ ప్రాక్టికల్స్ చేస్తుంటారు.

ఇలా వెళ్లొచ్చు..

ఈ సెంటర్ ను సందర్శించాలంటే ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లాలి. అక్కడ్నుంచి మంచాల్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా గునగల్ గ్రామం నుంచి కూడా రంగాపూర్- జాపాల్ అబ్జర్వేటరీ కొండకు చేరుకోవచ్చు. పబ్లిక్ హాలీ డే ఉన్న రోజుల్లో కేంద్రం మూసి ఉంటుంది. ఖగోళ శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కేంద్రాన్ని సందర్శిస్తే ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

IPL_Entry_Point

టాపిక్