Ramagunda Spl Drive: రామగుండం కమీషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్..నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు
Ramagunda Spl Drive: రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు సెప్టెంబర్ 3 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నారు. సెప్టెంబర్ 2 రాత్రిలోగా వాహనాలపై ప్రెస్ , పోలీస్, ఆర్మీ లాంటి స్టిక్కర్స్, నంబర్ ప్లేట్స్ పై వివిధ రాతలు, కార్ల అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ తొలగించుకోవాలని సిపి శ్రీనివాస్ సూచించారు.
Ramagunda Spl Drive: రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు సెప్టెంబర్ 3 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నారు. వాహనాల నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
సెప్టెంబర్ 2 రాత్రిలోగా వాహనాల పై ప్రెస్ , పోలీస్, ఆర్మీ లాంటి స్టిక్కర్స్, నంబర్ ప్లేట్స్ పై వివిధ రాతలు, గ్లాస్ పై బ్లాక్ ఫిల్మ్ ఉంటే వెంటనే తొలగించుకోవాలని సిపి శ్రీనివాస్ సూచించారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానా తోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
రామగుండం కమీషనరేట్ పరిధిలో వాహనాలపై ఇష్టం వచ్చినట్లు ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్ లు ఇతర రాతలు కనిపిస్తున్నాయని సిపి శ్రీనివాస్ తెలిపారు. కొంతమంది పోలీస్, ఆర్మీ, మీడియా సంస్థల్లో పనిచేయకున్నా ప్రెస్ అని తమ వాహనాలపై వేసుకుని తిరుగుతున్నారని వాటిని వెంటనే తొలగించాలని సీపీ హెచ్చరించారు.
వాహనాలకు నెంబర్ ప్లేట్ ను ఇష్టమొచ్చినట్లుగా, ఇతరులను ఆకర్షించేటట్లు మార్చేస్తున్నారు. ఉదాహరణకు 8055 నెంబరును BOSS లాగా మార్చేస్తున్నారు, వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విదంగా ఉండాలని సూచించారు. వాహనాలకు బ్లాక్ ఫిలిమ్‌లు తొలగించాలని, వాహనాలకు సంబంధించి సరైన ధ్రువ పత్రాలు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు కంపెని నుండి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫై చేస్తే వాటిని సెప్టెంబర్ 02వ తేది లోపు తొలగించాలన్నారు.
సెప్టెంబర్ 3 నుంచి కమీషనరేట్ పరిదిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిదిలో ప్రతి రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబందనలకు విరుద్దంగా, ట్రాఫిక్ నిబందనలను ఉల్లఘించిన వారికి జరిమానాలతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు.
నెంబర్ కనబడకుండా చేస్తే నేరం...
వాహనాల నెంబర్లు ట్యాంపరింగ్ చేయడం, నెంబరు ప్లేటు లేకుండా, నెంబర్ కనిపించడకుండా నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్లు అంటించడం, నెంబర్ కనిపించడకుండా బెండ్ చేయడం రకరకాల డిజైన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం నేరమన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో, ఇతరత్రా కేసులు చేధించడంలో వాహనాల నెంబర్లే ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. అలాంటిది వాహనాల నెంబర్లు కనబడకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాహనాల నెంబర్ ప్లేట్ రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) తప్పని సరిగా ఉండాలని సూచించారు.
ప్రైవేట్ వాహనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అత్యవసర సేవల సందర్భంగా వినియోగించే సైరన్ లను ఏర్పాటు చేశారని అట్టి వాహనదారులు వారం లోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలన్నారు. వాహనాల ముందు విండోకు 70 శాతం వెలుతురు వచ్చే విధంగా, వెనుక విండోకు 50 శాతానికి తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. వాహనాలను నిబందనల ప్రకారం సెప్టెంబర్ 2 లోపు మార్చుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 3 నుండి ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
కేసుల విచారణ వేగవంతం...
కమీషపరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల సబ్ డివిజన్ ఏసీపీ, సీఐ, పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓలతో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, గ్రేవ్ UI లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం, SC/ST UI కేసులు, విమెన్ ఎగైనెస్ట్ కేసులు, POCSO కేసుల పరిష్కారం, NDPS యాక్ట్ కేసులపై సిపి శ్రీనివాస్ సమీక్షా నిర్వహించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)