Telangana Assembly Sessions : శాసనసభ నుంచి BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ - స్పీకర్ నిర్ణయం
శాసనసభ సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు.

తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు. జగదీశ్ రెడ్డి వెంటనే సభ నుంచి వెళ్లి పోవాలని స్పీకర్ ఆదేశించారు.
బీఆర్ఎస్ సభ్యుల నిరసన…
జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగదీష్ రెడ్డి అనని మాటను అన్నట్లు చెబుతూ సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్ధాలపై జగదీష్ రెడ్డి ప్రశ్నించారని… సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సభ్యత్వాన్ని రద్దు చేయాలి - మంత్రి సీతక్క
జగదీష్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు దురహంకారానికి నిదర్శనమన్నారు. బడుగులను అవమానించేలా బీఆర్‌ఎస్ నేతల ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కాంగ్రెస్ కార్యకర్త అని అవమానించారని… జగదీష్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ను కోరుతున్నామని చెప్పారు.
ఏం జరిగిందంటే…?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సభ ప్రారంభమైన రెండో రోజే… అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ బీఆర్ఎస్ తరపున జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ… ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలోనే… అధికారపక్షం వైపు నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు.
జగదీశ్ రెడ్డి మాట్లాడే సమయంలో స్పీకర్ కల్పించుకొని…. సభా సంప్రదాయలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. అయితే ఇందుకు స్పందించిన జగదీశ్ రెడ్డి… స్పీకర్ ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి సభా సంప్రదాయాలను ఉల్లఘించానో చెప్పాలని కోరారు. అంతేకాదు… ఈ సభలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. మా అందరీ తరపున పెద్ద మనిషిగా మీరు స్పీకర్ గా కూర్చీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సభ మీ సొంతం కూడా కాదు అంటూ మాట్లాడారు. జగదీశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత సభను వాయిదా వేశారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం… చర్యలకు దిగింది.
సంబంధిత కథనం
టాపిక్