Sparrow Day: కరీంనగర్ లోని కిసాన్ నగర్ చెందిన అనంతుల రమేష్ ఇంటి ఆవరణలో ఎటు చూసినా పిచ్చుకలు కనిపిస్తుంటాయి. వాటి కోసం అతను ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. మొదట ఒక్కటి, రెండు పక్షులు ఇంటి అవరణకు వచ్చేవి. వాటికి గూడు లేక, ఆహారం లేక ఇబ్బంది పడ్డాయి. వాటిని రమేష్ గమనించాడు. దీంతో పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేశాడు.
పిచ్చుకలకు కావాల్సిన ఆహారం కూడా ఏర్పాటు చేశాడు. కరీంనగర్ లోని ఇంటి ఆవరణలో చెట్లు కూడా ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరిగిపో యింది.. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా చిప్పలు ఏర్పాటు చేసి నీళ్ళు పోసి పెడుతున్నాడు. దీంతో పిచ్చుకలన్నీ అక్కడికే వస్తున్నాయి.
దాదాపుగా 300 నుంచీ 400 వరకు పిచ్చుకలు ఈ ఇంటి అవరణలో కనిపిస్తాయి. వీటికి ఆహారంగా వివిధ రకాల గింజలను ఏర్పాటు చేశారు. కొన్ని పక్షులు సహజంగానే రమేష్ ఇంట్లో గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. రమేష్ కూడా వాటి కోసం డబ్బాలు ఏర్పాటు చేసి వాటిలో.. ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.
దీంతో ఉదయం ఆరు గంటలకు ఈ ఇంటి నిండా ఎటు చూసినా పక్షులే దర్శనమిస్తున్నాయి. వాటి అరుపులతో ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లిన తరువాత.. సాయంత్రం ఆరు తరువాత… మళ్లీ గూటికి చేరుకుంటాయి. ఈ ప్రాంతంలో అతనిని పిచ్చుకల రమేష్ అని కూడా పిలుస్తుంటారు.
కిలకిల రాగాలతో పిట్టలు రమేష్ ఇంట్లో సందటి చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులు పిచ్చుకలను చూడటానికి కోసం ప్రత్యేకంగా రమేష్ ఇంటికి వస్తున్నారు. సెల్ ఫోన్లో పిచ్చుకల ఫోటోలు తీసుకుని మురిసిపోతున్నారు. కాసేపు.. ఈ ప్రాంతంలో సరదాగా గడుపుతున్నారు. పిచ్చుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశానని రమేష్ చెబుతున్నారు. వాటికి ఆహారంతో పాటు.. నీటిని అందిస్తున్నానని చెబుతున్నారు.
కాగా వేసవి కాలంలో పిచ్చుకల కోసం అధికంగా తాగు నీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రమేష్. ఈ ప్రాంతం లో వీటి సంఖ్య రోజు రోజు రోజుకూ పెరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా సంతోషంగా ఉంటుందని రమేష్ చెబుతున్నారు.
మానవుడి మనుగడ కొన్ని రకాల పిట్టలతో ముడి పడి ఉంది. అలాంటి పిట్టలు, పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. రేడియేషన్ ప్రభావంతో కనిపించకుండా పోయాయి. నీరు ఆహారం దొరకక చనిపోతున్నాయి. ఎప్పుడూ సందడిగా ఉండే పిచ్చుకలు కనిపించడమే అరుదు.. కానీ కరీంనగర్ లో కిసాన్ నగర్ కు చెందిన యువకుడు అనంతుల రమేష్ బర్డ్ ప్రేమికుడిగా మారడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తన ఇంటినే పిట్టలకు ఆవాసంగా మార్చిన రమేష్ ను పలువురు అభినందిస్తున్నారు.
ఇంటిలో పిట్ట గూళ్ళు, జాలితో స్థావరం ఏర్పాటు చేసి పిట్టలకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నాడు. దీంతో వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రమేష్ ఇంట్లో పిట్టల సందడి వాతావరణం నెలకొంది. అంతరించిపోతున్న పక్షులను పాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రమేష్ కోరుతున్నాడు. సమ్మర్ లో ప్రతి ఇంటి ముందు పక్షుల కోసం చిప్పల్లో నీళ్లు పెట్టి కాస్త తిండి గింజలు వేస్తే పక్షులను కాపాడుకున్న వాళ్ళం అవుతామని అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం