Special Trains : వరుస సెలవులు...! దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం - ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు
South Central Railway Trains : వరుస సెలవులు రావటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తేదీలతో పాటు వెళ్లే రూట్ల వివరాలను తెలిపింది.
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. వరుస సెలవు దినాలు రావటంతో మరోసారి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, తిరుపతి, కాకినాడ, సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లు రాకపోకలను సాగిస్తాయని తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
ప్రత్యేక రైళ్లు - వివరాలు
- నర్సాపూర్-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది ఆగస్టు 18న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
- సికింద్రాబాద్ - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. ఇది ఆగస్టు 19వ తేదీన సాయంత్రం 06. 20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 5 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
- కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య కూడా ప్రత్యేక రైలును ప్రకటించారు. ఆగస్టు 17న రాత్రి 9 గంటలకు కాకినాడలో స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుంది.. ఆగస్టు 18న ఉదయం 09. 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. మళ్లీ ఆగస్టు 18న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ మరునాడు ఉదయం 06.30 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
- మరోసారి కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆగస్టు 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరనుంది. మరునాడు ఉదయం 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి ఆగస్టు 17వ తేదీన రాత్రి 07. 50 గంటలకు స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది మరునాడు ఉదయం 07.30 గంటలకు కాచిగూడకు చేరుతుంది.
- కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ ఆగస్టు 18న సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 6 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
- ఇక సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ఆగస్టు 09వ తేదీన ప్రత్యేక రైలు ఉంటుంది. ఇది మరునాడు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
క్యూఆర్ కోడ్ సేవలు:
మరోవైపు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను విక్రయించే అవకాశాన్ని ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వారా చిల్లర కష్టాలకు పూర్తిస్థాయిలో చెక్ పడనుంది.
అన్ని స్టేషన్లకు విస్తరణ…!
ఇంతకుముందే క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు చేసే విధానాన్ని ప్రయోగత్మకంగా పలు స్టేషన్లలోని కౌంటర్లలో ప్రవేశపెట్టింది. దీంతో ఆశించిన ఫలితాలు రావటంతో…. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో రైల్వే టికెట్ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు మరింత సులభతరం కానుంది.
తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో QR (Quick Response) కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపులు చేసేయవచ్చు. అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూపీఐ యాప్స్ వినియోగించి సింపుల్ గా డబ్బులను చెల్లించి టికెట్లను పొందవచ్చు. పేమెంట్ పూర్తి కాగానే టికెట్ అందజేస్తారు.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది రైల్వే శాఖ. జనరల్ బుకింగ్కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు.
ఈ విధానం ద్వారా ప్రధానంగా చిల్లర సమస్యలకు చెక్ పడినట్లు అయింది. తొలి దశలో భాగంగా…సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విజయవంతం కావటంతో జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకు విస్తరింపజేశారు. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపారు. మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.