MMTS Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిమజ్జనం రోజు రాత్రి నిరంతరాయంగా ఎంఎంటీఎస్ సేవలు
MMTS Trains : గణేష్ నిమజ్జనం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, రంగురంగుల లైట్లను చూడటానికి రెండుకళ్లు చాలవు. నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యం కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుండి 18 మధ్య రాత్రి వరకు జంట నగరాల్లోని వివిధ గమ్యస్థానాల మధ్య కొన్ని ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది. 8 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. గణపతి భక్తులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.
రైలు నెం- GHL-5 (హైదరాబాద్- లింగంపల్లి) సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి.. అదే రోజు రాత్రి 11:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
రైలు నెం- GHS-1 (సికింద్రాబాద్- హైదరాబాద్) సెప్టెంబర్ 17 రాత్రి 11:50 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
రైలు నెం- GHS-6 (లింగంపల్లి- ఫలక్‌నుమా) సెప్టెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 12:10 గంటలకు లింగంపల్లి నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 1:50 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.
- రైలు నెం- GHS-7 (ఫలక్‌నుమా- సికింద్రాబాద్) సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 2:20 గంటలకు ఫలక్ నుమా నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఫలకున్మా చేరుకుంటుంది.
ఈ రైళ్లనే తిరిగి మళ్లీ స్టార్ట్ అయిన స్టేషన్లకు పంపిస్తారు. ఆఖరి సర్వీస్ సికింద్రాబాద్- హైదారాబాద్ మధ్య నడుస్తుంది. 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై.. 4 గంటల 40 నిమిషాలకు ఎంఎంటీఎస్ ఆఖరి సర్వీస్ ముగియనుంది. నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, బేగంపేట్ స్టేషన్లలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ వాసులకు గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగరే గుర్తుకొస్తుంది. నగరంలో ఖైరతాబాద్ గణపతి నుంచీ.. గల్లీలోని బుల్లి గణపతుల వరకూ.. అన్నింటినీ ట్యాంక్‌బండ్ దగ్గరే ప్రతి ఏటా నిమజ్జనం చేస్తారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. గణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తెలంగాణ ప్రజలే కాకుండా.. ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు.
హైదరాబాద్‌లోని గణేష్ ఉత్సవ కమిటీలకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్‌లోనే గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి అనుమతించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ప్రభుత్వానికి సూచించింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ దగ్గర మంగళవారం ఉదయం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకే బ్యానర్లు కట్టామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే.. మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.