South Central Railway : త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు.. సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు నడిపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇక్కడి నుంచి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా ఇక్కడి నుంచి నడిపించనున్నారు.
త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతామని.. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. సికింద్రాబాద్- గుంటూరు మార్గంలో డబ్లింగ్ పూర్తయితే.. మరికొన్ని రైళ్లు నడిపే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. ఇటు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచనున్నట్లు చెప్పారు.

ఘట్‌కేసర్- యాదాద్రి..
ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి అనేక వినతులొస్తున్నాయని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని జైన్ స్పష్టం చేశారు. ఘట్‌కేసర్- యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్ కోసం రూ.650 కోట్లు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని జీఎం జైన్ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండోదశకు సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడిందని వెల్లడించారు.
ఆమోదం పొందిన తర్వాతే..
తెలంగాణలో చేపట్టిన అమృత్ స్టేషన్ల అభివృద్ధి పనులు.. వచ్చేఏడాది చివరి వరకు పూర్తవుతాయని.. అరుణ్ కుమార్ జైన్ వివరించారు. ప్రస్తుతం సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య 20, 16 కోచ్‌ల సామర్థ్యంతో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతోందని చెప్పారు. ఇది ఆమోదం పొందిన తర్వాత స్పష్టమైన ప్రకటన వస్తుందని జైన్ చెప్పారు.
పింక్ బుక్ వచ్చాకే..
రైల్వే బడ్జెట్‌లో వివిధ కేటాయింపులపై పింక్ బుక్ వచ్చాకే స్పష్టత వస్తుందని.. అరుణ్ కుమార్ జైన్ వివరించారు. పింక్ బుక్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టని కారణంగా.. రైల్వే బడ్జెట్ కేటాయింపుల వివరాలను వెల్లడించలేమని చెప్పారు. తెలంగాణలో నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులు, కొత్తవి మంజూరు, సర్వేలు, డీపీఆర్‌లు, సౌకర్యాలు, భద్రత సంబంధిత అంశాలు అన్నీ పింక్ బుక్‌లోనే ఉంటాయని వివరించారు.
భారీగా కేటాయింపులు..
రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. రైల్వేబడ్జెట్‌లో ఏపీకి రికార్డ్ స్థాయిలో కేటాయింపులు జరిగాయి. ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయించిన్టటు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించారు. కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.
రాష్ట్రానికి నమో భారత్..
రైల్వే బడ్జెట్‌లో ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు అయినట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో రాష్ట్రానికి నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు రానున్నాయని ప్రకటించారు. ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. ఏపీలో 74 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామన్న కేంద్రమంత్రి.. 1560 కి.మీ.కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేశామని చెప్పారు.