Charlapalli Railway Station : చర్లపల్లి నుంచే ఈ రెండు రైళ్లు స్టార్ట్.. మూడింటికి స్టాపేజీ.. పూర్తి వివరాలు ఇవే
Charlapalli Railway Station : సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచే రెండు రైళ్లను నడపాలని నిర్ణయించింది. అలాగే మరో మూడు రైళ్లకు స్టాపేజీ ఇచ్చింది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను కేంద్రం అభివృద్ధి చేసింది. దీంతో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్లలో రద్దీ తగ్గనుంది. రద్దీ తగ్గించే చర్యల్లో భాగంగా.. సౌత్ సెంటర్ల రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచే రెండు నడపాలని నిర్ణయించింది. అలాగే మూడు రైళ్లకు స్టాపేజీ ఇచ్చింది. ఈ నిర్ణయం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించింది.
ఇవే ఆ రెండు రైళ్లు..
గోరఖ్‌పుర్- సికింద్రాబాద్- గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ (12589/12590) మామూలుగా అయితే సికింద్రాబాద్ నుంచి బయల్జేరేది. దాన్ని సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చారు. ఈ రైలు మార్చి 12వ తేదీ నుంచి చర్లపల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. చెన్నై సెంట్రల్- హైదరాబాద్- చెన్నై సెంట్రల్ (12603/12604) ఇన్నాళ్లు నాంపల్లి నుంచి స్టార్ట్ అయ్యేది. దాన్ని కూడా చర్లపల్లికి మార్చారు. ఈ నిర్ణయం మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
వీటికి స్టాపేజీ..
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్లకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో స్టాపేజీ ఇస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్- సిర్పూర్‌కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12757) ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. 8.32కి చర్లపల్లికి చేరుకుని ఒక నిమిషం ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్‌కాగజ్‌నగర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12757) చర్లపల్లికి రాత్రి 7.02 గంటలకు చేరుకుంటుంది.
అలాగే.. గుంటూరు- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17201) చర్లపల్లిలో మధ్యాహ్నం 12.41కి వస్తుంది. సికింద్రాబాద్- గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17202) మధ్యాహ్నం 12.50కి చర్లపల్లిలో ఆగుతాయి. సికింద్రాబాద్- సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 3.47కి, సిర్పూర్‌కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17234) ఉదయం 9.20కి చర్లపల్లిలో ఆగనున్నాయి. ఈ నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానుందని అధికారులు వివరించారు.
ప్రత్యేక రైళ్లు..
సంక్రాంతి పండగ సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-తిరుపతి, వికారాబాద్-కాకినాడ, కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-శ్రీకాకుళం, చర్లపల్లి-శ్రీకాకుళం, నాందేడ్-కాకినాడ, చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.